
వైద్యులు చేతులెత్తేస్తే..108 సిబ్బంది పురుడు పోశారు
మదనపల్లె రూరల్ : జిల్లా ఆస్పత్రికి ప్రసవ వేదనతో వచ్చిన ఓ మహిళకు.. తాము కాన్పు చేయలేమని వైద్యులు చేతులెత్తేశారు. గర్భిణిని తిరుపతికి తీసుకెళ్తుండగా, మార్గమధ్యంలో భాకరాపేట ఘాట్ వద్ద 108 వాహనంలోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. జిల్లా ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కనపరిస్తే.. 108 సిబ్బంది పురుడుపోశారని మహిళ కుటుంబీకులు చేతులెత్తి దండం పెట్టారు. వివరాల మేరకు..
నిమ్మనపల్లె మండలం వెంగంవారిపల్లె పంచాయతీ కత్తిరివారిపల్లెకు చెందిన సాగర్ భార్య భాగ్యమ్మ(20) రెండో కాన్పు నిమిత్తం పుట్టినిల్లు మదనపల్లె మండలం బసినికొండలో ఉంటోంది. శనివారం అర్ధరాత్రి తర్వాత ఆమెకు పురిటినొప్పులు మొదలవడంతో 108 వాహనం బసినికొండకు చేరుకుని భాగ్యమ్మను మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తెచ్చారు. వార్డులోకి తీసుకెళ్లేందుకు వీల్‌ఛైర్ లేకపోవడంతో కుటుంబసభ్యులు నొప్పులు పడుతున్న మహిళను నడిపించుకునే తీసుకెళ్లారు. ఆ సమయానికి డాక్టర్ అందుబాటులో లేకపోవడం, నర్సింగ్ సిబ్బంది నామమాత్రపు పరీక్షలు చేసి తిరుపతికి వెళ్లాలంటూ రెఫర్ చేశారు. ఆస్పత్రికి చేరుకున్న 108 సిబ్బంది ఈఎన్‌టీ రెడ్డి జశ్వంత్, పైలట్ సద్దాం గర్భిణి ప్రసవవేదనను గమనించి, ఈ స్థితిలో తిరుపతికి తరలిస్తే మార్గమధ్యంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, ఆస్పత్రిలోనే కాన్పు చేయండంటూ అభ్యర్థించారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా చికిత్స గురించి మీరు చెప్పేదేంటి. ఆమెకు రక్తం ఆరు పాయింట్లు ఉంది. మేం రెఫర్ చేస్తే తీసుకెళ్లడం మీ బాధ్యత. తీసుకువెళ్లండంటూ గదమాయించారు. చేసేదేమీలేక 108 సిబ్బంది భాగ్యమ్మను తిరుపతికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో నొప్పులు అధికమయ్యాయి. దీంతో భాకరపేట ఘాట్ సమీపంలో 108 వాహనంలోనే 3.5 కిలోల బరువున్న మగపిల్లవాడికి జన్మనిచ్చింది. 108 సిబ్బంది ప్రసవానంతర చికిత్సలు అందించి, మరింత మెరుగైన చికిత్స కోసం తిరుపతి మెటర్నరీ ఆస్పత్రిలో చేర్పించారు.