
సీఎం అనుమతించినా.. ఫలితం లేదు
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఆర్టీిసీ ప్రభుత్వంలో విలీనానికి ముందే చేరిన ఉద్యోగులకు పాత పద్ధతుల్లోనే పదోన్నతులు కల్పించాలని సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి.నరసయ్య డిమాండ్ చేశారు. నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో శనివారం యూనియన్ జోనల్ సమావేశం నిర్వహించారు. మీడియాతో వారు మాట్లాడుతూ ఏపీఎస్సార్టీిసీ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల మేరకు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారన్నారు. ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దల అంగీకారం అనంతరం సీఎం గత నెల 28న ఆర్టీసి ఉద్యోగులకు పాత పద్ధతుల్లోనే పదోన్నతులు కల్పించాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు. సంబంధిత జీఓను టిఆర్–బి అధికారులు జీఏడీకి పంపినా, అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారి మొండి వాదనలు చేస్తూ ఫైల్ కదలకుండా అడ్డుకుంటున్నారన్నారు. ఆరేళ్లుగా పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న 6000 మంది ఉద్యోగులు నిరుత్సాహానికి గురవుతున్నారని ఆరోపించారు. 11వ పీఆర్సీకి సంబంధించి 24 నెలల అరియర్స్, నాలుగు డీఏలు ప్రకటిస్తారని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ఉద్యమబాట పడతామని హెచ్చరించారు. సీ్త్రశక్తి పథకం భవిష్యత్తులో విజయవంతంగా నడవాలంటే ప్రస్తుతం ఉన్న బస్సులు సరిపోవలేదని అన్నారు. వెంటనే 3000 బస్సులు కొనుగోలు చేయాలని, అన్ని కేటగిరీలలో సుమారు పదివేల పోస్టులను భర్తీ చేయాలని కోరారు. విద్యుత్ బస్సులను ఆర్టీసీ సిబ్బందితో నడిపించాలని కోరారు. ఈ సమావేశంలో పి.సుబ్రహ్మణ్యంరాజు, సి.నబీరసూల్, కె.మద్దిలేటి, కె.అర్జున, పి.ఏ.మజీద్, యన్.విజయకుమార్, సి.వి.మురళీధరన్, వి.వెంకటేశ్వర్లు, ఏ.మురగమ్మ, కె.బి.నాగార్జున రెడ్డి, యస్.ప్రసాద్ బాబు, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ యం.రామాంజనేయులు, వైస్ ప్రెసిడెంట్ విజయకుమార్, ట్రెజరర్ నాగేంద్రప్రసాద్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు
పలిశెట్టి దామోదర్‌రావు