
డ్రాగా ముగిసిన ఏసీఏ అండర్–23 మ్యాచ్
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–23 మల్టీ డే మ్యాచ్ మూడో రోజున డ్రాగా ముగిసింది. అనంతపురం–కర్నూలు జట్ల మధ్య కెఎస్‌ఆర్‌ఎం క్రికెట్ మైదానంలో శనివారం మూడో రోజున ఎనిమిది వికెట్ల నష్టానికి 114 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాంటింగ్ ప్రారంభించిన అనంతపురం జట్టు 148 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని ఎంకె.దత్తారెడ్డి 57 పరుగులు చేశాడు. కర్నూలు జట్టులోని అక్షిత్‌రెడ్డి నాలుగు, సాబ్‌జాన్ మూడు, కనిష్ రెండు వికెట్లు తీశారు. అనంతరం కర్నూలు జట్టు రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించి 74 పరుగులకు డిక్లేర్డ్ చేసింది. ఆ జట్టులోని సాయి గణేష్ 22 పరుగులు చేశాడు. అనంతపురం జట్టులోని దీపక్ మూడు వికెట్లు తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 16.1 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. ఆ జట్టులోని మహేంద్ర 40 పరుగులు చేశాడు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ అధిక్యంతో కర్నూలు జట్టు మూడు పాయింట్లు దక్కించుకుంది.
వైఎస్సార్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో.....
వైఎస్సార్ స్టేడియంలో చిత్తూరు–నెల్లూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. శనివారం మూడో రోజున రెండు పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 40 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 96 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. ఆ జట్టులోని నిఖిలేశ్వర్ 40, పవన్ రిత్విక్ 23 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని అచ్యుతానంద రెండు వికెట్లు తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన చిత్తూరు జట్టు 58 ఓవర్లకు తొమ్మిది వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. ఆ జట్టులోని రెడ్డి రుషిల్ 42, జివి,చరణ్‌జిత్ 67 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని సుజిత్‌రెడ్డి నాలుగు, మాధవ్ మూడు వికెట్లు తీశారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. నెల్లూరు జట్టు తొలి ఇన్నింగ్స్‌లో అధిక్యం దక్కించుకుంది.
నగదు తిరిగి ఇవ్వమన్నందుకు ఇద్దరిపై దాడి
మదనపల్లె రూరల్ : నగదు తిరిగి ఇవ్వమని అడిగినందుకు ఇద్దరిపై దాడికి పాల్పడిన ఘటన శనివారం కురబలకోట మండలంలో జరిగింది. తంబళ్లపల్లె మండలం ఎద్దులవారిపల్లెకు చెందిన అబ్దుల్లా(47) అతడి తమ్ముడు ఖాదర్‌వలి(29) కురబలకోట మండలం ముదివేడుకు చెందిన బావాజాన్ వద్ద రూ.1.75 లక్షలకు రెండు పాడి ఆవులు కొనుగోలు చేశారు. అయితే, చెప్పిన మేరకు ఆవులు పాలు ఇవ్వకపోవడంతో తిరిగి వెనక్కి ఇచ్చి తమ డబ్బు చెల్లించాలని కోరారు. కొద్ది రోజులుగా నగదు ఇవ్వకుండా బావాజాన్ ఇబ్బంది పెట్టడంతో శనివారం అన్నదమ్ములు ఇద్దరూ ముదివేడుకు చేరుకుని తమకు రావాల్సిన నగదుపై బావాజాన్‌ను నిలదీశారు. దీంతో అతను తన అనుచరులతో కలిసి అబ్దులా, ఖాదర్‌వలిలపై దాడి చేయించాడు. గాయపడిన బాధితులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్సలు పొందారు.
వేర్వేరు ఘటనల్లో ఇద్దరి ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మహిళలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రభుత్వాసుపత్రిలో చికిత్సలు పొందుతున్నారు. పట్టణంలోని చంద్రాకాలనీకి చెందిన మూర్తి భార్య ఉలిగెమ్మ(24) భర్తతో గొడవపడి మనస్తాపం చెంది ఇంటివద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. అదేవిధంగా మండలంలోని పోతబోలు పంచాయతీ నడింపల్లెకు చెందిన వెంకటరమణ భార్య రెడ్డెమ్మ(50) అనారోగ్య కారణాలతో మనస్తాపం చెంది ఇంట్లోనే పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆయా ఘటనల్లో గమనించిన కుటుంబసభ్యులు బాధితులను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు.