
టీడీపీ వారికే డైరెక్టర్ పదవులా?
కడప కోటిరెడ్డిసర్కిల్ : వైఎస్సార్ జిల్లాలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకట సుబ్బారెడ్డి విమర్శించారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో శనివారం ఆయన మాట్లాడుతూ బీజేపీ, జనసేన నాయకులను సంప్రదించకుండా కేవలం టీడీపీ వారికే రిమ్స్‌లో డైరెక్టర్ పదవులు కట్టబెట్టారన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి శంకుస్థాపనలకు వస్తామన్నా పట్టించుకోకుండా.. ఇతర కార్యక్రమాల్లో నిమగ్నం కావడం తగదన్నారు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌లు కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నారన్నారు. అయితే ఆ సంబంధాలు దెబ్బతినేలా టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి వ్యవహరిస్తున్నారన్నారు. కడప పరిస్థితిని సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రి లోకేష్ దృష్టికి తీసుకుపోతామన్నారు. ఎన్నికలకు ముందు బీజేపీ, జనసేన లేకుండా కార్యక్రమాలు చేపట్టేవారు కాదని, ప్రస్తుతం బీజేపీ, జనసేనను పట్టించుకునే వారే లేరన్నారు. ఇప్పటికై నా కూటమి సంబంధాలు మెరుగు పడేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బొమ్మన విజయ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ నాయుడు, బీజేపీ నాయకులు శివనాయక్, రమణ చారి, లక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ అధ్యక్షుడు జంగిటి వెంకటసుబ్బారెడ్డి