
బీటెక్ విద్యార్థికి రూ.61 లక్షల పరిహారం
ప్రొద్దుటూరు క్రైం : రోడ్డు ప్రమాదంలో గాయపడి రెండు కాళ్లను పోగొట్టుకున్న బీటెక్ విద్యార్థి వడ్ల సుమంత్‌కు రోడ్డు ప్రమాద పరిహార క్లెయిమ్ కింద రూ.61లక్షల చెక్‌ను మెగా లోక్ అదాలత్‌లో రెండో అదనపు జిల్లా జడ్జి సత్యకుమారి శనివారం అందజేశారు. వివరాల మేరకు.. ప్రొద్దుటూరులోని హనుమాన్‌నగర్‌కు చెందిన సుమంత్ బీటెక్ చదువుతున్నాడు. గత ఏడాది సెప్టెంబర్ 5న చిన్నాన్న సుధాకర్‌తో కలిసి బైక్‌లో ఎర్రగుంట్లకు వెళ్లాడు. పని ముగించుకొని ప్రొద్దుటూరుకు బయలుదేరారు. సుధాకర్ బైక్ నడుపుతుండగా సుమంత్ వెనుక కూర్చున్నాడు. పోట్లదుర్తి వద్దకు రాగానే వెనుకవైపు నుంచి వస్తున్న టిప్పర్ వారి బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో సుమంత్ రెండు కాళ్లు నుజ్జు నుజ్జయ్యాయి. వెంటనే అతడిని కర్నూలుకు తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి హైదరాబాద్‌కు రెఫర్ చేశారు. వారికి సుమారు రూ.40 లక్షలకు పైగా ఖర్చయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనపై ఎర్రగుంట్ల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. బాఽధితులు కోర్టులో మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్‌ను దాఖలు చేశారు. మెగా లోక్ అదాలత్‌లో ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు, భాధితులకు రాజీ కుదరడంతో కోర్టు సూచన మేరకు చోళమండలం ఇన్సూరెన్స్ కంపెనీ పరిహారం కింద బీటెక్ విద్యార్థి సుమంత్‌కు రూ.61 లక్షల చెక్కును అందజేసింది. ఈ కార్యక్రమంలో న్యాయవాది ఎస్‌కే రియాజుద్ధిన్, కంపెనీ న్యాయవాది రాజశేఖర్‌రెడ్డి, సోమేశ్వరరావు పాల్గొన్నారు.