కాయ్‌ రాజా కాయ్‌ | - | Sakshi
Sakshi News home page

కాయ్‌ రాజా కాయ్‌

Sep 14 2025 2:33 AM | Updated on Sep 14 2025 2:33 AM

కాయ్‌ రాజా కాయ్‌

కాయ్‌ రాజా కాయ్‌

నేడు ఇండియా – పాకిస్తాన్‌ దేశాల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌

క్రికెట్‌ బెట్టింగ్‌ అనగానే గుర్తొచ్చేది ప్రొద్దుటూరు. ఒక విధంగా చెప్పాలంటే క్రికెట్‌ బెట్టింగ్‌కు ఈ పట్టణం పుట్టినిల్లు అని చెప్పొచ్చు. మ్యాచ్‌లు ప్రారంభమైతే చాలు పోలీసులు నిఘా పెట్టడం.. ప్రతి రోజూ బుకీల అరెస్ట్‌ చేయడం తరచూ జరుగుతోంది. తాజాగా కాయ్‌ రాజా కాయ్‌ అంటూ యాప్‌లపై బెట్టింగ్‌ జోరుగా సాగుతోంది. కేంద్రం చట్టం చేసిన నేపథ్యంలో ఈసారైన అడ్డుకట్ట పడుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

ప్రొద్దుటూరు క్రికెట్‌ బుకీలకు

కళ్లెం వేసేది ఎవరు?

ఆసియా కప్‌ టీ20 టోర్నీతో

జోరందుకున్న బెట్టింగ్‌

నేడు ఇండియా–పాకిస్థాన్‌ మధ్య

క్రికెట్‌ మ్యాచ్‌

ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు పట్టణంలో ఒకప్పుడు క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహణ అంటే టీవీ, మొబైల్‌ పోన్లు, రాసుకోవడానికి నోట్‌ బుక్కులు, లైన్‌బాక్స్‌ సెటప్‌ ఉండేది. వీటన్నింటినీ ఒక గదిలో ఏర్పాటుచేసుకొని లైవ్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు చూస్తూ బెట్టింగ్‌ రాసేవాళ్లు. ఇందుకోసం గుమస్తా, డబ్బు వసూలు చేయడానికి బాయ్‌లను పెద్ద మొత్తంలో జీతాలు చెల్లించి నియమించుకునేవారు. ఐపీఎల్‌, వరల్డ్‌కప్‌ లాంటి వరుస క్రికెట్‌ మ్యాచ్‌లు జరిగే సమయంలోనూ బుకీలు ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు. అయితే వీరు ఏ ప్రాంతంలో ఉన్నా టవర్‌ లొకేషన్‌ ఆధారంగా పోలీసులు సులభంగా పట్టుకునేవారు. ఘటనా స్థలంలో స్వాధీనం చేసుకున్న డబ్బునేగాక బ్యాంకుల్లో ఉన్న మొత్తాన్ని కూడా ఫ్రీజ్‌ చేసేవారు.

సొంతంగా యాప్‌ల నిర్వహణ

కొన్నేళ్ల తర్వాత టెక్నాలజీ మారిపోయింది. స్మార్ట్‌ మొబైల్‌తో టెక్నాలజీని క్రికెట్‌ బుకీలు ఉపయోగించారు. కొన్నేళ్ల నుంచి ఈ పద్ధతి ఆన్‌లైన్‌లో జోరుగా సాగుతోంది. వారిని పట్టుకోవడం పోలీసులకు సాధ్యం కావడం లేదు. ఇటీవల బెట్టింగ్‌ యాప్‌లు పెరిగిన నేపథ్యంలో యువత సులభంగా డౌన్‌లోడ్‌ చేసుకొని బెట్టింగ్‌ ఆడుతున్నారు. యాప్‌ల నుంచి ఆదాయం వస్తుండటంతో ప్రొద్దుటూరు బుకీల చూపు ఈ యాప్‌లపై మళ్లింది. లక్షల రూపాయలు వెచ్చించి కొందరు బుకీలు యాప్‌లను కొనుగోలు చేశారు. వాటి ఐడీలను తమ ముఖ్య అనుచరులకు ఇచ్చి బెట్టింగ్‌ దందా నిర్వహిస్తున్నారు. యాప్‌ల ద్వారా బుకీలు రూ.కోట్లు ఆర్జించినట్లు టాక్‌ నడుస్తోంది. ఇతర దేశాలకు వెళ్లి అక్కడి నుంచి యాప్‌ల ద్వారా ఈ బెట్టింగ్‌ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. దీంతో వారిని పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. నాలుగైదేళ్ల నుంచి క్రికెట్‌ బెట్టింగ్‌ కేసులు పూర్తిగా తగ్గిపోయాయి.

కొత్త చట్టంతో చెక్‌ పడుతుందా?

తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం సంపాదించుకోండి.. రండి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి.. మీ ఫోన్‌లో ఆడుతూ రూ.వేలు, లక్షలు జేబులో వేసుకోండి శ్రీ అంటూ సినిమా హీరోలు, ఇతర సెలబ్రెటీలు టీవీల్లోనూ, సోషల్‌ మీడియాలో ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఏ సామాజిక మాధ్యమాల్లో చూసినా ఇలాంటి ప్రకటనలే కనిపించేవి. వీటికి ఆకర్షితులైన యువత బెట్టింగ్‌ మాయలో పడిపోతున్నారు. ఐపీఎల్‌ లాంటి వరుస మ్యాచ్‌లు జరిగినప్పుడు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ఆడేవారి సంఖ్య గణనీయంగా ఉంటుంది. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో నష్టపోయి రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది ప్రాణాలను కోల్పోయారు. కొన్ని నెలల క్రితం ప్రొద్దుటూరులో ఓ యువకుడు బెట్టింగ్‌లో అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే ప్రాంతంలో ఐదు నెలల క్రితం ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ముఠాపై పోలీసులు దాడులు చేశారు. దాడుల్లో 23 మందిని అరెస్ట్‌చేసి వారి నుంచి రూ.3.10లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇదే కేసులో పలువురు ప్రధాన బుకీలపై కేసు నమోదు చేశారు. అనేక మంది ప్రాణాలను బలితీసుకున్న ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, గేమింగ్‌లను చెక్‌పెట్టే దిశగా అత్యంత కీలకమైన బిల్లును గత నెల 20న లోక్‌సభ ఆమోదించింది. ఆన్‌లైన్‌ గేమ్‌లను నిర్వహించినా, ప్రోత్సహించినా జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించేలా ఈ బిల్లును కేంద్రం రూపొందించింది. రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఇది చట్టంగా మారనుంది. గేమింగ్‌ యాక్ట్‌ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఆసియా కప్‌ టోర్నీ జరుగనుంది.

ఆసియా కప్‌ టోర్నీలో భాగంగా ఆదివారం దుబాయ్‌ వేదికగా ఇండియా–పాకిస్తాన్‌ మధ్య హై ఓల్టేజీ టి20 క్రికెట్‌ మ్యాచ్‌ జరుగనుంది. ఆదివారం జరిగే మ్యాచ్‌కు ప్రొద్దుటూరుతోపాటు జిల్లా వ్యాప్తంగా రూ.వందల కోట్లు బెట్టింగ్‌ జరిగే అవకాశం ఉంది. బెట్టింగ్‌ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన నేపథ్యంలో బుకీలు ఆన్‌లైన్‌లో పందేలు నిర్వహిస్తారా లేక ఆఫ్‌లైన్‌లో ఆడతారా అనేది తెలియాల్సి ఉంది. ప్రతిష్టాత్మకమైన ఈ క్రికెట్‌ మ్యాచ్‌లో ప్రొద్దుటూరు బుకీల ఆగడాలను పోలీసులు నిలువరిస్తారో లేదో చూడాలి మరి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement