
ప్రభుత్వ సంస్థలను కాపాడుకుందాం
కడప కోటిరెడ్డిసర్కిల్ : దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్‌ఐసీని, జాతీయ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వ విధానాలు బలహీన పరుస్తున్నాయని సీపీఎం రాజ్యసభ సభ్యుడు శివ దాసన్ తీవ్రంగా విమర్శించారు. సేవ్ పబ్లిక్ సెక్టార్ కమిటీ కన్వీనర్, ఎల్‌ఐసీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎ.రఘునాథరెడ్డి అధ్యక్షతన బుధవారం కడప యూటీఎఫ్ భవన్‌లో జరిగిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల సెమినార్ లో సీపీఎం రాజ్యసభ్యులు శివదాసన్ మాట్లాడుతూ దేశంలో యూనివర్సిటీలలో రెగ్యులర్ ఫ్యాకల్టీ లేరని, విద్యా రంగానికి బడ్జెట్ కేటాయింపులు తగ్గిపోయాయని అన్నారు. ఆరోగ్య రంగంలో కేటాయింపులు తగ్గిపోవడం వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా నియంత్రించలేని స్థితి నెలకొన్నదన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి టీడీపీ, వైఎస్సార్ సీపీ మద్దతు ఇస్తున్నాయని అన్నారు. ప్రభుత్వాలు విగ్రహాలకు వందల కోట్లు ఖర్చు పెడుతున్నాయని, కానీ స్కూళ్లను, హాస్పిటల్స్ ను పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ వ్యవస్థలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై, ప్రజాప్రతినిధులపై ఉందని, పెన్షన్ సదుపాయం అన్నది రాజ్యాంగ హక్కు అని పాలకులు గుర్తించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అవధానం శ్రీనివాస్, శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మి రాజా, నాగమునిరెడ్డి, రాజశేఖర్ రాహుల్, రవితేజ, ఎన్.శివశంకర్ , రామ్మూర్తి నాయుడు, అజీజ్, లలిత, రామకృష్ణా రెడ్డి, సుధాకర్, వెంకటరామరాజు, సుబ్బారెడ్డి, డి.మొహమ్మద్, ఎ. సుబ్బారావు, వి.రామంజులరెడ్డి పాల్గొన్నారు.