
నియామకం
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లాకు చెందిన దిగువ పేర్కొన్న నాయకులను పార్టీ రాష్ట్ర అనుబంధ కమిటీల్లో వివిధ హోదాల్లో నియమించినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర మహిళా విభాగం జాయింట్ సెక్రటరీగా పీలేరుకుచెందిన బి.హరితను, రాష్ట్ర ఎస్టీ విభాగం ప్రధాన కార్యదర్శిగా తంబళ్లపల్లెకు చెందిన శ్రీనివాసులునాయక్, రాష్ట్ర ఐటీ విభాగం ప్రధాన కార్యదర్శిగా కోడూరుకు చెందిన ఎం.చంద్ర కుళాయప్పలను నియమించారు.
రాయచోటి టౌన్: రాష్ట్ర ఎన్జీవో అసోషియేషన్ ఉమ్మడి కడప జిల్లా అధ్యక్షుడిగా బి. శ్రీనివాసులు రెండోసారి ఎంపికయ్యారు. మంగళవారం కడపలో నిర్వహించిన ఎన్నికల్లో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని రాయచోటి తాలూకా ఎన్జీవోల సంఘం నాయకులు తెలిపారు. శ్రీనివాసులుకు పలువురు అభినందనలు తెలిపారు.
రాయచోటి టౌన్: రాయచోటి శ్రీ వీరభధ్రస్వామి ఆలయ ఈవో డివి రమణారెడ్డి కుమార్తె దేవిరెడ్డి శ్రావ్య బీడీఎస్‌లో గోల్డ్‌మెడల్ సాధించింది. 2021లో మెడిసిన్‌లో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించింది. ప్రస్తుతం ఈమె ఎండీఎస్ చదువుతోంది. బీడీఎస్ (2021)లో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంక్ సాధించినందుకు మంగళవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర గవర్నర్ డాక్టర్ అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో వైద్య విభాగం అధికారులు డాక్టర్ ఓపీ యాదవ్, డాక్టర్ పి. చంద్రశేఖర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్‌తో పాటు సిల్వర్ మెడల్‌ను అందుకున్నారు. ఈ సందర్బంగా తల్లిదండ్రులు, బంధువులు శ్రావ్యకు శుభాకాంక్షలు తెలియచేశారు.
కురబలకోట: కురబలకోట మండలంలోని ఎగువ చెన్నామర్రి వద్ద చిరుత పులి ఆనవాళ్లు కలకలాన్ని సృష్టిస్తున్నాయి. మంగళవారం రాత్రి కట్టేసిన కుక్కను చిరుత చంపినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. వివరాలు..హార్సిలీహిల్స్ పరివాహక ప్రాంతంలోని ఎగువ చెన్నామర్రికి చెందిన రెడ్డిశేఖర్ రెడ్డి ప్రతి రోజు రాత్రి సమయంలో పెంపుడు కుక్కను కాపలాగా పొలం వద్ద కట్టేసేవారు. మంగళవారం కూడా కట్టేశాడు. బుధవారం ఉదయం వచ్చి చూడగా కుక్క కన్పించలేదు. రక్తపు మరకలు కన్పించాయి. దీంతో భయాందోళనలకు గురయ్యారు. చిరుత కుక్కను చంపి తినేసి ఉంటుందని భావిస్తున్నారు. అటవీ శాఖ ఎఫ్‌బీఓ జయరాం స్థానికులను విచారించారు. చిరుత పాద ముద్రలను పరిశీలించారు. పొలాల వద్దకు వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. హార్సిలీహిల్స్ నుండి ఈ చిరుత వచ్చి ఉండవచ్చని బావిస్తున్నారు.

నియామకం