
రేషన్ షాపులపై విజిలెన్స్ దాడులు
లక్కిరెడ్డిపల్లి : వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులు అనే నెపంతో మండలంలోని 19, 25, 26 రేషన్ దుకాణాలపై సీఐ నారాయణ, ఎన్‌ఫోర్స్‌మెంట్ తహసీల్దార్ వెంకటరెడ్డి రెవెన్యూ సిబ్బందితో కలిసి ఏకకాలంలో దాడులు నిర్వహించి.. దుకాణాలలో ఎటువంటి చిన్నపాటి వ్యత్యాసాలు లేకుండానే ఆథరైజేషన్ లేదనే నెపంతో ఆరు కేసులు నమోదు చేయడం జరిగిందని రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మండలంలోని మద్దిరేవుల గ్రామం రేషన్ షాప్ నెంబర్లు 25, 26, పందిళ్లపల్లి గ్రామ కస్సా రేషన్ షాప్ నెంబరు 19ను విజిలెన్సు అధికారులు తనిఖీలు చేపట్టడం జరిగింది. రేషన్ దుకాణాలలో బియ్యం, చెక్కర, అంగన్‌వాడీకి సంబంధించిన పామ్ ఆయిల్, కందిపప్పు, సన్నబియ్యంలలో చిన్నపాటి వ్యత్యాసాలు చూపెడుతూ కేసులు నమోదు చేసినట్లు రేషన్ డీలర్లు పేర్కొన్నారు. మండలంలోని 30 రేషన్ షాపులకు గత నాలుగేళ్లుగా ఆథరైజేషన్‌లు లేవనే విషయం సంబంధిత తహసీల్దార్‌కు తెలిపిన విషయమే అన్నారు. ఆథరైజేషన్‌లు ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది ఇవ్వాల్సి ఉన్నా తహసీల్దార్ రర్యాలయ సిబ్బంది పట్టించుకోకపోవడంతోనే పెండింగ్‌లో ఉన్న విషయం రెవెన్యూ సిబ్బందికి తెలుసునని వాపోయారు. ఇప్పడేమో రేషన్ షాపులపై అధికార పార్టీ ఒత్తిడితో విజిలెన్సు అధికారులను పంపించి దాడులు చేయించడం, తమకు కోర్టు ఆర్డర్లు ఉన్నాయనే ఉత్తర్వులను విజిలెన్సు అధికారులు చూపించి, తమపై అసభ్య పదజాలాలు వాడుతూ బెదిరింపుకు దిగుతున్నారని రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిల్వ ఉన్న సరుకులను సంబంధిత వీఆర్‌ఓలకు అప్పగిస్తున్నామంటూనే అధికార పార్టీ సానుభూతి పరుల ఇళ్లలోకి రేషన్ బియ్యాన్ని తరలించడం జరుగుతోందన్నారు. కేవలం అధికార పార్టీ ఒత్తిడి వల్లే తమ రేషన్ షాపులపై విజిలెన్సు దాడులు చేయించడం జరుగుతుందని రేషన్ డీలర్లు వాపోతున్నారు.
వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులనే నెపంతో..