
క్లుప్తంగా
నందలూరు : మండలంలోని లేబాక గ్రామ పంచాయతీ మరాటిపల్లె గ్రామంలో అత్తపై అల్లుడు దాడి చేసిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నరసింహారావు అలియాస్ చిన్న అనే వ్యక్తి మరాటపల్లె గ్రామానికి చెందిన మంజులాబాయిని వివాహం చేసుకున్నాడు. ఆర్థిక సమస్యల కారణంగా భార్య మంజులబాయి ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లింది. వెళ్తూ వారిద్దరి పిల్లలను తన తల్లి పద్మావతిబాయి దగ్గర వదిలి వెళ్లింది. తన పిల్లలను తనతో పంపాలని అత్తతో గొడవకు దిగిన అల్లుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మల్లిఖార్జునరెడ్డి తెలిపారు.
టిప్పర్ ఢీకొని 11 పొట్టేళ్లు మృతి
తంబళ్లపల్లి : టిప్పర్ ఢీకొని 11 పొట్టేళ్లు మృతి చెందిన సంఘటన తంబళ్లపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. బాధితుడి కథనం మేరకు.. తంబళ్లపల్లి మండలం ఎర్రసానిపల్లెకు చెందిన సుధాకర్ ఆదివారం పొట్టేళ్లను మేపడానికి తోలుకెళ్లాడు. అవి రోడ్డు దాటుతుండగా అదే సమయంలో వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. పొట్టేళ్లు రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోయాయి. అక్కడికక్కడే చనిపోయిన వీటిని చూసి బాధితుడు బోరున విలపించాడు. రూ. 2 లక్షల దాకా నష్టం సంభవించిందని, ఆదుకోవాలని ఆయన కోరారు.

క్లుప్తంగా