
సర్కారు దవాఖానా.. ఓపీ రాసేదెవరన్నా..
● ఇదీ సిద్దవటం ఆస్పత్రి తీరు
● రోగులపై నర్సు ఆగ్రహం
సిద్దవటం : సిద్దవటం ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం ఓపీ రాసేందుకు కూడా దిక్కులేకుండా పోయింది. పై పెచ్చుగా ఆసుపత్రికి వచ్చిన రోగులపై డ్యూటీ నర్సు ఆగ్రహం వ్యక్తం చేయడంతో మహిళా డాక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇటీవల వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల వల్ల వైరల్ జ్వరాలు విజృంభించాయి. కుటుంబంలో ఒకరిద్దరికి జ్వరాలు సోకాయి. సిద్దవటం ప్రభుత్వ ఆసుపత్రిలో రోజుకు 250 ఓపీల సంఖ్య ఉందంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల కనీస మర్యాద లేకుండా.. ‘ఇవాళ ఆదివారం ఒక డాక్టర్ మాత్రమే ఉంటారని ఓపీ రాయం, బీపీ చూడం, కట్టు కట్టం’ అంటూ నర్సు విచక్షణ కోల్పోయి మాట్లాడటం పట్ల రోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వేల కోట్లు వెచ్చించి కోట్లాది రూపాయలు ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తుందని, అలాంటిది రోగుల పట్ల నర్సు కనీస మర్యాద లేకుండా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఆమైపె చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.