
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
చిట్వేలి : మండల పరిధిలోని నేతివారిపల్లి ఎస్టీ కాలనీకి చెందిన దాసరి ప్రశాంతి(25) అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఆదివారం ఉదయం చిట్వేలి పోలీసులకు ఫిర్యాదు అందింది. వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరుటౌన్ గాంధీ గిరిజన కాల నీకి చెందిన ప్రశాంతికి అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం నేతివారిపల్లి ఎస్టీ కాలనీకి చెందిన రాజేష్‌తో తొమ్మిది నెలల క్రితం వివాహం జరిగింది. తరువాత కొన్నాళ్ల నుంచి కుటుంబ కలహాలు మొదలు కావడం, అత్తారింటి వేధింపులు ఎక్కువ కావడంతో అనుమానస్పదంగా మృతి చెందినట్లు మృతురాలి తండ్రి దాసరి రమేష్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.