
శునకాలు పట్టేస్తున్నాయ్..!
● బి.కొత్తకోటలో వెంటాడి కరుస్తున్న కుక్కలు
● ఒక్కరోజే 35 మంది ఆస్పత్రిపాలు
● నాలుగు రోజుల్లో 60 మందికి పైనే
● ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయం
బి.కొత్తకోట : స్థానిక నగర పంచాయతీ పరిధిలో గ్రామ సింహాలు స్వైరవిహారం చేస్తున్నాయి. పదుల సంఖ్యలో గుంపులుగా పట్టణమంతా సంచరిస్తూ అలజడి సృష్టిస్తున్నాయి. ప్రతి రోజూ కనిపించిన వారినల్లా కరచి ఆస్పత్రి పాలు చేస్తున్నాయి. ఇలా ఒకరిద్దరిని కాదు ఏకంగా పదుల సంఖ్యలో బాధితులు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. గురువారం ఒక్కరోజే 35 మందికి పైగా ఆస్పత్రిపాలయ్యారు. సాయంత్రం స్థానిక మీడియా ప్రతినిధి చిట్టా రామకృష్ణారెడ్డి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా కుక్కల గుంపు దాడి చేసి కాలిపై కరిచాయి. అంతటితో ఆగని కుక్కలు వరుసగా కనిపించిన వారందరిపైనా దాడి చేస్తూ కరుస్తూ వెళ్లాయి. స్థానికులు, స్థానికేతరులైన 35 మంది వరకు బాధితులయ్యారు. వీరిలో చిట్టా రామకృష్ణారెడ్డి, డి.రామకృష్ణారెడ్డి, డి.రమాదేవి, రెడ్డెమ్మ, కృష్ణారెడ్డి, లక్ష్మిదేవి, వెంకటమ్మ, కృష్ణమూర్తి, నరసమ్మ, వెంకటస్వామి, విష్ణువర్దన్, ఎర్రమ్మ, రమాదేవి, బయ్యన్న, భాగ్యశ్రీ, కిట్టన్న, పద్మావతి, ఎం.వెంకటమ్మ, కళావతి, షబీనా, రామ్మూర్తి, రయాన్, లింగమ్మలు స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వైద్యం చేయించుకోగా మిగిలిన వారు ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లినట్టు సమాచారం.
కాగా ఈనెల ఒకటిన కుక్క కాటుకు గురైన నరసమ్మ, వర్షణీ, హబీబ్‌జాన్, రెడెమ్మలు, రెండో తేదిన హష్మీ, బిందు, రెడ్డెమ్మ, దర్షిత, అమీనాబీ, నీలమ్మ, మహ్మద్, ఆసీఫ్, అర్షిత, మూడో తేదీన శ్రీరజ్, గణేష్, జీవన్‌కుమార్, ప్రసాద్, వెంకటరమణ, నారాయణలు కుక్క కాట్లకు గురై స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందారు. వీరుకాక పదుల సంఖ్యలో బాధితులు ప్రయివేటు ఆస్పత్రులు, మదనపల్లెకు వెళ్లి చికిత్సలు పొందుతున్నారు. బి.కొత్తకోట పట్టణంలో కుక్కల సంతతి జనంతో పోటీ పడుతున్నట్టు కనిపిస్తోంది. ఏ వీధిలో చూసినా, ప్రధాన రహదారులపైనా కుక్కలే కనిపిస్తాయి. అందులో గుంపులే అధికం. దీనితో వారికి ఎవరు ఎదురుపడినా దాడి చేస్తూ కరుస్తున్నాయి. ఈ వరుస ఘటనలపై కమిషనర్ జీవీ ప్రమీల మాట్లాడుతూ కుక్కలను అదుపు చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, చర్యలు తీసుకుంటామని చెప్పారు.
భయం.. భయం
బి.కొత్తకోటలో జనం రోడ్లు, వీధుల్లోకి రావాలంటేనే భయకంపితులవుతున్నారు. ఏ క్షణంలో కుక్కలు దాడి చేస్తాయో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. స్కూళ్లకు వెళ్లే చిన్నారులు, నడిచి పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులు తమ బిడ్డలపై కుక్కలు దాడి చేస్తాయన్న భయాందోళనతో ఉన్నారు. పిల్లలను వెంట తీసుకెళ్తున్నారు. అయినప్పటికీ స్కూళ్ల వెలుపలకు వస్తే కుక్కల బారిన పడ్తారేమో అన్న ఆందోళనతో ఉన్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా కుక్కలు కాట్లు వేస్తుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. వాటి నుంచి రక్షించాలంటూ ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
బి.కొత్తకోటలో కుక్కల గుంపు
ప్రభుత్వాసుపత్రికి వచ్చిన కుక్కకాటు బాధితులు

శునకాలు పట్టేస్తున్నాయ్..!