
కూటమి ప్రభుత్వంలో రైతులకు అన్నీ కష్టాలే
● యూరియా బస్తా కోసం తీవ్ర ఇక్కట్లు
● 9న జిల్లా కలెక్టరేట్ రైతుపోరును విజయవంతం చేయాలి
● వైఎస్సార్ సీపీ సమన్వయకర్త
నిసార్‌అహ్మద్
మదనపల్లె రూరల్ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా రైతుల పరిస్థితి మరింత దయనీయంగా తయారైందని నియోజకవర్గ సమన్వయకర్త నిసార్‌అహ్మద్ అన్నారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రైతుల సమస్యలపై ఈ నెల 9న అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తామన్నారు. రైతుపోరు నిరసన కార్యక్రమానికి మదనపల్లె నియోజకవర్గం నుంచి పెద్దసంఖ్యలో రైతులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రైతుపక్షపాతిగా వారికిచ్చిన మాట ప్రకారం ప్రతి పథకాన్ని అందజేసి రైతు సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. ఏ సీజన్‌కు సంబంధించిన ఇన్‌పుట్ సబ్సిడీ అదే సీజన్‌లో ఇస్తూ.. రైతులకు అండగా నిలిచామన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. మామిడి, టమాటా పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. చివరకు వరి పంటకు అవసరమైన యూరియాను రైతులకు అందించలేక ఇబ్బందులు పెడుతున్నారన్నారు. గంటల తరబడి క్యూలో నిల్చుంటే కేవలం ఒక బస్తాను ఇవ్వడమే కాకుండా పంపిణీలో రాజకీయ వివక్ష కనపరుస్తున్నారన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆర్‌బీకేల ద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఎరువును సకాలంలో అందించామన్నారు. మదనపల్లె నియోజకవర్గంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని కనపరుస్తోందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సీటీఎం వద్ద టమాటా ప్రాసెసింగ్ యూనిట్, కోల్డ్‌స్టోరేజీ ఏర్పాటు చేస్తామని యువగళం పాదయాత్ర సందర్భంగా నారాలోకేష్ హామీ ఇచ్చారన్నారు. అయితే అధికారంలోకి వచ్చి 14 నెలలు పూర్తి కావస్తున్నా ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. హంద్రీ–నీవా కాలువలో కృష్ణాజలాలు మదనపల్లె మీదుగా కుప్పం వెళుతున్నాయే కానీ, మదనపల్లె నియోజకవర్గానికి సాగునీరు అందించేందుకు కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ చేనేతవిభాగం జిల్లా అధ్యక్షులు శీలంరమేష్, రైతు నాయకులు జన్నే రాజేంద్రనాయుడు, చిప్పిలి జగన్నాథరెడ్డి, సీటీఎం–2 పంచాయతీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు బండపల్లె వెంకటరమణ, గ్రానైట్ మహేష్, వేణుగోపాల్, మజ్జిగ కేశవ, రామమూర్తి, శివ, శంకరనాయక్, చలపతి, నాగార్జున, శ్రీరాములు, చిన్నికృష్ణ, విశ్వనాథ్, జహీర్, అనిల్‌కుమార్‌రెడ్డి, కౌన్సిలర్ ఈశ్వర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.