
పది పరీక్షల నిర్వహణ బకాయిలు చెల్లించండి
రాయచోటి : పదో తరగతి పరీక్షలు నిర్వహించి తిరిగి స్పాట్ వ్యాల్యుయేషన్‌లో పాలుపంకున్న ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలను చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ పరీక్షల సంచాలకులు కేవీ శ్రీనివాసులురెడ్డిని యూటీఎఫ్ అన్నమయ్య జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు హరిప్రసాద్, జాబీర్‌లు కలిసి వినతి పత్రం అందజేశారు. గురువారం విజయవాడలోని ఆయన కార్యాలయంలో వారు కలిశారు. వినతిపై స్పందిస్తూ బకాయిలకు సంబంధించిన టోకెన్ నంబర్లను సమర్పిస్తే బకాయిలు విడుదల చేస్తామని చెప్పారని యూటీఎఫ్ నాయకులు తెలిపారు. ఇదే విషయంపై అన్నమయ్య జిల్లా డీఈఓను అనేక సార్లు ఆదేశించినా టోకెన్ నంబర్లను పంపకపోవడంతో చెల్లింపుల్లో ఆలస్యం అవుతుందన్నారు. మూడు సంవత్సరాలకు సంబంధించిన బిల్లు బకాయిలు, ఈ విద్యా సంవత్సరంలో (రూ. 60 లక్షలు) స్పాట్ వాల్యుయేషన్ పూర్తయి నాలుగు నెలలు గడిచినప్పటికీ చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై డీఈఓ, జిల్లా కలెక్టర్, ఆర్‌జేడీ కార్యాలయాల ఎదుట వివిధ రూపాలలో నిరసనలు తెలియజేసినా పట్టించుకోలేదన్నారు. ఇప్పటికై నా అధికారులు బకాయిలు చెల్లించే విషయంలో నిర్లక్ష్యం వహించినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో ఇతర ఉపాధ్యాయ సంఘాలను కలుపుకొని డీఈఓ కార్యాలయ ముట్టడికి పిలుపునిస్తామని ఏపీ పరీక్షల సంచాలకులకు తెలియపరిచినట్లు యూటీఎఫ్ నాయకులు తెలిపారు.