
పకడ్బందీగా స్వామిత్వ సర్వే
నిమ్మనపల్లె : ప్రజల నివాస ప్రాంతాలకు సంబంధించి తమ ఆస్తిపై పూర్తి హక్కు కల్పించేలా చేపట్టిన స్వామిత్వ సర్వే పకడ్బందీగా పూర్తి చేస్తున్నట్లు మదనపల్లె డీఎల్‌పీఓ నాగరాజు తెలిపారు. గురువారం మండంలోని రాచవేటివారిపల్లె పంచాయతీ ఎగువమాచిరెడ్డిగారిపల్లె, బండ్లపై, ముష్టూరు, కొండయ్యగారిపల్లె తదితర గ్రామాల్లో సచివాలయ సిబ్బంది చేపట్టిన స్వామిత్వ సర్వేను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్వే నిర్వహణపై సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వామిత్వ స్కీమ్ గ్రామాల్లో మెరుగైన సాంకేతికతతో కూడిన సర్వే, మ్యాపింగ్ కోసం ఏర్పాటు చేసిన పథకమన్నారు. ప్రజల సామాజిక, ఆర్థిక సాధికారత, స్వీయ సాధికారతను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వ పథకంగా 2020 ఏప్రిల్ 24న స్వామిత్వ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారన్నారు. 2021 నుంచి 2025 వరకు దేశవ్యాప్తంగా 6.62 లక్షల గ్రామాలను ఈ పథకంలో సర్వే చేయనున్నట్లు తెలిపారు. ఆస్తి డేటాను సేకరించేందుకు డ్రోన్‌లతో సహా వివిధ సాంకేతికతను ఉపయోగించనున్నట్లు తెలిపారు. ఈనెల పదో తేదీలోగా సర్వే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. 15వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుందన్నారు. అందుకు అవసరమైన చర్యలు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రమేష్‌బాబు, డిప్యూటీ ఎంపీడీఓ బాలరాజు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.