
ఆడుకుంటూ.. అనంతలోకాలకు..
మదనపల్లి రూరల్ : బుడిబుడి అడుగులతో ఆడుకుంటున్న ఓ చిన్నారి.. అనంతలోకాలకు వెళ్లింది. తెల్లవారితే కుటుంబ సభ్యుల మధ్య పుట్టినరోజు జరుపుకోవాల్సిన ఆ అమ్మాయి.. నీటి సంపులో పడి మృతి చెందిన సంఘటన గురువారం రాత్రి మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని బాబు కాలనీకి చెందిన జమీర్, సిద్దిక దంపతుల కుమార్తె సానియా (2) సాయంత్రం కనిపించకుండా పోయింది.
ఓవైపు వారానికి ఒకసారి వచ్చే మున్సిపాలిటీ నీళ్లు పట్టుకునే క్రమంలో, అందరూ హడావిడిగా ఉన్నారు. మరోవైపు సానియా ఆటలాడుకుంటూ తన ఇంటి పక్కనున్న మరో ఇంటిలోకి వెళ్లింది. ఆడుకుంటూ వారెవరూ గమనించని సమయంలో ప్రమాదవశాత్తు నీటి సంపులో పడిపోయింది.కుమార్తె కనిపించకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతుకుతుండగా, పక్కింటి వారు నీటి సంపునకు మూత వేసేందుకు దగ్గరకు వచ్చి చూశారు.
చిన్నారి సంపులో పడిపోయి ఉండటాన్ని గమనించి బయటకు తీశారు. అప్పటికే పాప మృతి చెందడంతో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కాగా సానియా శుక్రవారం జన్మదిన జరుపుకోవాల్సి ఉంది. తెల్లవారితే తమ బిడ్డ బర్త్ డే చేయాల్సిన తల్లిదండ్రులు, జీవం లేని చిన్నారిని ఎత్తుకుని తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఘటనపై పోలీసులకు ఎటువంటి సమాచారం లేదని తెలిసింది.