
ఉపాధిలో రూ.1.30 లక్షల నిధుల దుర్వినియోగం
● ఏపీఓ, ఇద్దరు టీఏలకు షోకాజ్ నోటీసులు
● ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు
బి.కొత్తకోట : స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం జరిగిన సామాజిక తనిఖీ ప్రజా వేదికలో రూ.1.30 లక్షల నిధులు దుర్వినియోగమైనట్లు గుర్తించారు. గత ఏడాది ఆగస్టు 18 నుంచి ఈ ఏడాది ఆగస్టు 26 వరకు మండలంలోని 15 గ్రామ పంచాయతీల్లో మొత్తం 1,226 పనులకు గాను రూ.5.69 కోట్ల నిధులను వెచ్చించారు. ఉపాధి హామీ ద్వారా జరిగిన ఈ నిధుల వినియోగంపై ఎస్‌ఆర్పీ తిరుమలేష్ పర్యవేక్షణలో 12 మంది డీఆర్పీల బృందం గత 10 రోజుల పాటు మండలంలో పూర్తి చేసిన పనులను తనిఖీ చేశారు. డ్వామా పీడీ వెంకటరత్నం సమక్షంలో జరిగిన బహిరంగ సభలో ఆడిట్ అధికారులు నిధుల దుర్వినియోగం వివరాలను వెల్లడించారు. అదే విధంగా ఆడిట్ సిబ్బంది తనిఖీలో పొంతనలేని రూ.17.93 లక్షల నిధుల దుర్వినియోగంపై సమగ్రంగా విచారణ చేపట్టాలని ఏపీడీని ఆదేశించారు. అంతేగాక విధుల పట్ల అలసత్వం వహించిన ఏపీఓ మంజుల, టెక్నికల్ అసిస్టెంట్లు నారాయణ, మణికంఠలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అలాగే ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్లు క్రిష్ణకుమార్, నరసింహులును విధుల నుంచి తొలగించామని పీడీ పేర్కొన్నారు. ఎంపీపీ లక్ష్మీ నరసమ్మ, క్లస్టర్ ఏపీడీ నందకుమార్, ఎంపీడీఓ క్రిష్ణవేణి, ఏపీఓ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.