
ఇది ప్రజలను ముంచే ప్రభుత్వం
కడప కార్పొరేషన్ : ఇది మంచి ప్రభుత్వం కాదు.. ప్రజలను ముంచే ప్రభుత్వమని గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, నంద్యాల పార్లమెంటు పరిశీలకురాలు కల్పలతారెడ్డి విమర్శించారు. బుధవారం కడపలో పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డితో కలిసి ఆయన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాం.. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యిందని కూటమి నేతలు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ నెలకు రూ.1500 ఇస్తామని చెప్పి, దాన్ని పీ4కు అప్పగించామని చెప్పడం దారుణమన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి దాన్ని స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు అప్పగించడం దురదృష్టకరమన్నారు. కూటమి పాలనలో ఏ వర్గమూ సంతోషంగా లేదని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మహిళలు, నిరుద్యోగులు, రైతులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, వారిపై వేధింపులు, హత్యలు, అత్యాచారాలు, దాడులు పెరిగిపోయారన్నారు. ఉద్యోగులకు ఇంకా పీఆర్‌సీ ప్రకటించలేదని, ఐఆర్, డీఏ బకాయిలు చెల్లించలేదన్నారు. పేద విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించపోవడం దారుణమన్నారు.
పాఠశాలల్లో నాడు – నేడు పనులు
పూర్తి చేయాలి: ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి
ప్రభుత్వ పాఠశాలల్లో నాడు– నేడు కింద 80 శాతం పూర్తయిన పనులను వెంటనే పూర్తి చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. చాలాచోట్ల అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు చెట్ల కింద పాఠాలు వినాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. డిజిటల్ బోర్డులు, ట్యాబ్‌లు పాడైపోయాయని, ఆర్‌ఓ ప్లాంట్లు మూతపడ్డాయన్నారు. ఈ సమావేశంలో 46వ డివిజన్ కార్పొరేటర్ ఎంవీ శ్రీదేవి పాల్గొన్నారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి