
ఎరువుల దుకాణాల తనిఖీ
కలికిరి : యూరియా డిమాండ్‌ను అదునుగా చేసుకుని రైతులకు అధిక ధరలకు విక్రయిస్తే దుకాణాలు సీజ్ చేస్తామని మండల వ్యవసాయాధికారి హేమలత హెచ్చరించారు. కలికిరిలోని ఓ ఎరువుల దుకాణంలో యూరియా అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు సాక్షిలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ మేరకు స్పందించిన వ్యవసాయాధికారి సోమవారం దుకాణాన్ని తనిఖీ చేసి యూరియా విక్రయాలు, నిల్వ రికార్డులను పరిశీలించారు. బస్తా ధర రూ.266.50కు మాత్రమే విక్రయించాలని హెచ్చరించారు. అలాగే మేడికుర్తిలోని ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేశారు.
ప్రజలను మోసగించిన చంద్రబాబు
రాయచోటి : రాజంపేటలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనతో ప్రజల చెవిలో పువ్వులు పెట్టి మోసం చేశారని సీపీఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు ఒక ప్రకటనలో విమర్శించారు. చంద్రబాబు తనను తాను పొగుడుకోవడానికి, వైఎస్సార్‌సీపీని విమర్శించడానికే పరిమితం అయ్యారన్నారు. ఇందుకోసం కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
కడప–బెంగళూరు రైల్వేలైనుకు నిధులు, అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణానికి, బొప్పాయి రైతులను ఆదుకోవడం గురించి, జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పన, అభివృద్ధికి నిధులు విడుదల తదితర అంశాల ప్రస్తావన చేయకపోవడం దుర్మార్గమన్నారు. అధికార పార్టీ నేతలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అన్నమయ్య జిల్లా అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని నిలదీయాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సీపీఎం నాయకులను అక్రమంగా నిర్బంధించడం అన్యాయమన్నారు.