పుల్లంపేట : కడప–రేణిగుంట జాతీయ రహదారిపై పుల్లంపేట మండలం రామక్కపల్లి సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉమ్మడి శ్రీనివాసులు (45) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలిలా.. పుల్లంపేట మండలం, పుత్తనవారిపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు దివ్యాంగుడు. ఇతనికి ఒక కన్నులేదు. కాగా తన భార్య బిడ్డలను పోషించుకునేందుకు పుల్లంపేట మండలం, అప్పయ్యరాజుపేట సమీపంలోని పెట్రోల్ బంకులో పనిచేసేవాడు. యథావిధిగా సోమవారం పెట్రోల్ బంకుకు తన ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. రామక్కపల్లి సమీపంలోకి రాగానే తనముందు వెళ్తున్న కారును ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించగా ఎదురుగా అతివేగంగా వస్తున్న లారీ ఢీకొంది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పుల్లంపేట ఎస్‌ఐ శివకుమార్, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
టీడీపీ, జనసేన వర్గాల ఘర్షణ
పీలేరు రూరల్ : పీలేరు పట్టణంలో ఆదివారం రాత్రి వినాయక విగ్రహాల ఊరేగింపు సందర్భంగా దొడ్డిపల్లె పంచాయతీ కొత్తపేటకు చెందిన జనసేన పార్టీ కార్యకర్తలు, రెడ్డివారిపల్లెకు చెందిన టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో సీఐ యుగంధర్ ఆయా గ్రామాల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.