
బాబు నోట.. ఓట్ల మాట !
● రాజంపేట వాసుల ఆశలపై ‘బాబు’నీళ్లు
● పరోక్షంగా రాజంపేట జిల్లా కాదనే
సంకేతాలు..
రాజంపేట/ సాక్షి రాయచోటి : ప్రజాసంక్షేమం, అభివృద్ధి గురించి చెప్పకుండా ఓట్ల మాటను సీఎం చంద్రబాబునాయుడు ప్రస్తావించడం రాజంపేట ప్రాంతీయులను కలవరపాటుకు గురిచేసింది. సీఎం వస్తున్న సందర్భంగా రాజంపేటను జిల్లా ప్రకటన చేస్తారని ఈ ప్రాంత వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలపై ముఖ్యమంత్రి నీళ్లు చల్లారు. గత కొద్దిరోజుల నుంచి జిల్లా సాధనసమితి, టీడీపీకి చెందిన కొందరు నేతలు జేఎసీతో జిల్లా కావాలంటూ కార్యక్రమాలను చేపట్టారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు పర్యటన ఖరారైన నేపథ్యంలో జిల్లాపై ప్రకటన చేయాలని కోరుతామని వారు ప్రకటనలు గుప్పించారు. ప్రజావేదికపై చంద్రబాబు ప్రసంగిస్తుండగా రాజంపేట జిల్లా ప్రకటన చేస్తారని ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి చేసిన సేవలను చెప్పుకొంటూ, ఆద్యంతం కొనసాగించారు. జిల్లా ప్రకటన అంశాన్ని తెరౖపైకి తీసుకొచ్చిన రాజంపేట, రైల్వేకోడూరు సీపీఎం నేతలను హౌస్ అరెస్టు చేశారు. . ఏదీ ఏమైనప్పటికి రాజంపేట జిల్లా చేసేందుకు వీలుకాదనే సంకేతాలను చంద్రబాబు ప్రజల్లోకి పంపారు.
● సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేటలో టీడీపీ ఓటమిని ముఖ్యమంత్రి చంద్రబాబు జీర్ణించుకోలేకపోయినట్లుగా కనిపిస్తోంది. ఓట్లు వేయలేదని అక్కసును బహిర్గతం చేశారు. ఓట్లు వేసిన వారికి ఏమీ చెప్పాలంటూ, ప్రతికూలత చెప్పకుండా చెప్పినట్లు చెప్పేస్తారు. అంటే రాయచోటి జిల్లా కేంద్రం నుంచి మార్చే భావన ముఖ్యమంత్రికి లేనట్లు కనిపిస్తోంది. లేక మదనపల్లెను జిల్లా చేయాలనే తలంపుతోనే సీఎం మాట్లాడినట్లుగా జనం గుర్తించారు.
● రాజంపేట టీడీపీ ఇన్‌చార్జిగా చమర్తి జగన్‌మోహన్‌రాజును ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రజావేదికలో ప్రకటించారు. ఇక్కడ ఎమ్మెలే, ఎంపీ లేకపోయినా పర్వాలేదు..ఇన్‌చార్జిగా చమర్తి జగన్‌మోహన్‌రాజును అనధికారిక ఎమ్మెల్యేగా పరిచయం చేసినట్లైందన్న విమర్శలు వెలువడ్డాయి. కాగా చమర్తి ఫ్లెక్ల్సీలు చెల్లాచెదురుగా, చినిగిపోయి కనిపించాయి.
ముఖ్యమంత్రి పర్యటనలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు ముందురోజు ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవనే భరోసా ఇచ్చారు. అందుకు విరుద్ధంగా రాజంపేట వైపు హరితహోటల్, వైజంక్షన్ దిగ్భంధం చేశారు.ఎంజీపురం నుంచి నందలూరు వైపు రాకపోకలపై పోలీసుల ఆంక్షలు ప్రయాణికులు, వాహనదారులను ఇబ్బందులకు గురిచేసింది. దీంతో వారు పెదవి విరిచారు. పోలీసులు పసుపునేతలకు ట్రాఫిక్ విషయంలో రాచమర్యాదలు చేశారు.
జనం లేక...రాక అధికారుల అగచాట్లు
చంద్రబాబు పర్యటనలో జనంలేక పోవడంతో అధికారులు నానాఅగచాట్లు పడ్డారు. మండలంలోని చుట్టుపక్కల గ్రామాలకు చెందిన నిరుపేద కూలీలను రప్పించి, వారిచేత పచ్చజెండాల ఇచ్చి నిలబెట్టారు. చంద్రబాబు పర్యటన ఆద్యంతం సినిమా సెట్టింగ్ తరహాలో కొనసాగింది.
● చంద్రబాబు టీడీపీ క్యాడర్‌తో సమావేశమనగా నాయకులు, కార్యకర్తలు అనేక ఆలోచనలు చేశారు. తమ గోడు చెప్పుకునే అవకాశం కలుగుతుందని ఆశించారు. కానీ అక్కడ జరిగింది ఏమీ లేదు.దీంతో పార్టీ నేతలు అసంతృప్తికి గురయ్యారు.