
ఆగని ఆక్రమణలు
బండలు వలచి...దిన్నెలు తొలగించి చదను చేస్తున్న ఆక్రమణదారులు
రాయచోటి : అన్నమయ్య జిల్లా కేంద్రం పట్టణ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణ దందా కొనసాగుతోంది. వాగులు, వంకలను, చిన్నచిన్న గుట్టలను సైతం ఆక్రమణదారులు వదలడం లేదు. ప్రభుత్వ భూములతోపాటు గతంలో పట్టాలు ఇచ్చిన భూములనూ తమకున్న రాజకీయ పలుకుబడితో కొందరు భూ బకాసురులు ఆక్రమిస్తున్నారు. రాయచోటి పట్టణ పరిధిలోని సర్వేనంబర్ 604 పరిధిలో ఉన్న 50 సెంట్ల ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ భూమిలో ఉన్న బండరాళ్ల సైతం తొలగించి చదును చేస్తున్నారు. ఈ భూమి విలువ సుమారు రెండు కోట్ల రూపాయలు పలుకుతుందని స్థానికులు అంటున్నారు. గతంలో ఇదే స్థలాన్ని కొతమంది లబ్ధిదారులకు రెవెన్యూ అధికారులు పట్టాలు ఇచ్చినట్లు సమాచారం. రెవెన్యూ అధికారులు స్పందించి ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ భూములను కాపాడి ప్రజా అవసరాలకు ఉపయోగించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.