రాజంపేట రూరల్ : ఎన్నికల సమయంలో రాజంపేటకు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కదాని ఊసెత్తని సీఎం చంద్రబాబు ఏ ముఖం పెట్టుకొని రాజంపేటకు వస్తున్నాడని ఏపీసీసీ కార్యవర్గ సభ్యుడు అత్తింజేరి శ్రీనాథ్ ప్రశ్నించారు. స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో ఆదివారం డీసీసీ నాయకులు వెంకటేష్, శ్రీనివాసులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తామని బహిరంగ సభలో ఇచ్చిన హామీ ఏమైందని బాబును నిలదీశారు. అన్నమయ్య ప్రాజెక్టు పునర్ నిర్మాణం హామీని గాలికి వదిలేసి రైతులను నట్టేట ముంచుతున్నారన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి రూ.15 వేల కోట్లు నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలన్నారు.
వేర్వేరు ప్రమాదాల్లో
ముగ్గురికి తీవ్ర గాయాలు
మదనపల్లె రూరల్ : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం చెదలవారిపల్లెకు చెందిన డిగ్రీ విద్యార్థి బాలాజీ(20) సొంత పనులపై బైక్‌లో పుంగనూరుకు వస్తుండగా, మార్గమధ్యంలోని నల్లగుట్టపల్లె వద్ద ట్రాక్టర్ ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు బాధితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అదేవిధంగా సత్యసాయిజిల్లా కదిరి పట్టణం ఆర్‌ఎస్.రోడ్డుకు చెందిన అన్నదమ్ములు దాదాపీర్(20) అతడి తమ్ముడు అక్బర్(17) కురబలకోట మండలం అంగళ్లులోని బంధువుల ఇంటికి వచ్చారు. అక్కడి నుంచి బైక్‌లో అమ్మమ్మ ఇంటికి వెళుతుండగా, మార్గమధ్యంలోని విశ్వం కళాశాల వద్ద కారును ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు బాధితులను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. సంబంధిత పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
వివాహిత ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : కుటుంబ సమస్యలతో వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం నిమ్మనపల్లె మండలంలో జరిగింది. నిమ్మనపల్లెకు చెందిన ద్వారకనాథ్ భార్య లీలావతి(36) కుటుంబ సమస్యల కారణంగా ఇంట్లోనే ఉరివేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన 108 వాహనంలో వాల్మీకిపురం కమ్యూనిటీ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స అనంతరం మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నిమ్మనపల్లె పోలీసులు విచారణ చేస్తున్నారు.
పాత విధానంలో పరీక్షలు నిర్వహించాలి
రాయచోటి : పాత విధానంలోనే పరీక్షలు నిర్వహించాలని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జాబీర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం బుక్‌లెట్ అసెస్‌మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో ఉపాధ్యాయులకు ఆటంకం కలుగుతున్నందున పాత విధానంలోనే పరీక్షలు నిర్వహిస్తే బాగుంటుందని సూచించారు. ఆదివారం రాయచోటిలోని వైవీ నాగిరెడ్డి డిగ్రీ కళాశాల ఆవరణంలో జరిగిన ఉపాధ్యాయ సంఘాల నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి పూర్తిగా మినహాయించాలన్నారు. ఫార్మెటివ్, సమ్మెటివ్ పరీక్షల విధానాన్ని పాత పద్ధతిలోనే నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రెడ్డిముని సుధాకర్, చిన్నమండెం మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, సహాధ్యక్షుడు కఫాయత్, వీరబల్లి మండల ప్రధాన కార్యదర్శి అమీనుల్లా, లక్కిరెడ్డిపల్లి నాయకులు రఖీబ్, ఆదిల్, ఇస్మాయిల్ పాల్గొన్నారు.