
పోలీసు నిర్బంధంలో జిల్లా సాధన సమితి నేత
రాజంపేట : రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ జిల్లా సాధన సమితి జేఏసీ పేరుతో కార్యక్రమాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ రాజంపేట ఇన్‌చార్జి పూల భాస్కర్‌ను ఆదివారం పట్టణ పోలీసులు అక్రమంగా నిర్బంధించారు. కాగా సోమవారం రాజంపేటకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రానున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పోలీసులు ఈ చర్యకు పాల్పడ్డారు. హక్కులను అడిగితే పోలీసులు నిర్బంధించడం అన్యాయమని పూల భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా టీడీపీ నేతలు కొందరు జేఏసీ పేరుతో రాజంపేటను జిల్లాగా ప్రకటించాలని కార్యక్రమాలు చేశారు. అయితే వారిని ఎవరిని కూడా పోలీసులు నిర్బంధించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఐజేయూ సభ్యుడిగా
ఎం.ప్రభాకర్‌రెడ్డి
రాయచోటి జగదాంబసెంటర్ : ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ)లో అన్నమయ్య జిల్లాకు చోటు లభించింది. ఏపీయూడబ్ల్యుజే రాష్ట్ర కమిటీ అన్నమయ్యకు అవకాశం కల్పిస్తూ నిర్ణయించింది. జిల్లా కమిటీ చేసిన ప్రతిపాదనను రాష్ట్ర కమిటీ ఆమోదించి, ఐజేయూ సభ్యుడిగా ఎం.ప్రభాకర్‌రెడ్డిని నియమిస్తూ అధికారికంగా ప్రకటించిందని ఏపీయూడబ్ల్యుజే జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసులు, వంశీధర్ తెలిపారు. ప్రభాకర్‌రెడ్డి నియామకం పట్ల జిల్లా గౌరవాధ్యక్షుడు కృష్ణయ్య, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజు, ఈశ్వర్, రాష్ట్ర సమితి సభ్యులు శ్రీనివాస్‌గౌడ్, రామచంద్రయ్య, వెంకటేష్, జిల్లా కు చెందిన జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు.
బైక్ ఢీకొని నలుగురికి గాయాలు
నిమ్మనపల్లె : బైక్ ఢీకొని ఒకే కుటుంబంలో నలుగురు గాయపడిన సంఘటన ఆదివారం మండలంలో జరిగింది. తవళం పంచాయతీ చౌకిళ్లవారిపల్లెకు చెందిన సుబహాన్(27) తన భార్య రమీజా(25), కుమారుడు నవాజ్‌బాషా(6), కుమార్తె ఉమియా తస్లీమ్(3)తో కలిసి బైక్‌లో వెళుతుండగా కొమ్మిరెడ్డిగారిపల్లె వద్ద మరో ద్విచక్రవాహ నం ఎదురుగా వచ్చి ఢీకొనడంతో గాయపడ్డారు. ప్రమాదంలో సుబహాన్, రమీజా తీవ్రంగా గాయపడగా, ఇద్దరు పిల్లలు స్వల్పంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు బాధితులను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు.