
రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించాలి
రాయచోటి టౌన్ : రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగిస్తామని గత ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అఖిల పక్ష కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం రాయచోటిలోని డాక్టర్ అంబేద్కర్ ఫ్లెక్సీ వద్ద ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓపీడీఆర్ రాష్ట్ర సహాయ కార్యదర్శి టి. ఈశ్వర్ మాట్లాడుతూ రాయలసీమలోనే అత్యంత వెనకబడిన ప్రాంతం రాయచోటి అన్నారు. అలాంటి రాయచోటిని జిల్లా కేంద్రంగా ఉంచడం వలన ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. బాస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లం తాతయ్య మాట్లాడుతూ జిల్లాల పునర్విభజన కోసమని మంత్రివర్గ కమిటీ వేశారన్నారు. దీనివలన అన్నమయ్య జిల్లా ప్రజల్లో ఆందోళన, గందరగోళం నెలకొందన్నారు. అన్ని అర్హతలు ఉన్న రాయచోటిని జిల్లా కేంద్రంగానే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్పీయస్ రాష్ట్ర నాయకుడు రామాంజనేయులు, బీసీ సంఘం నాయకులు విజయభాస్కర్, నాగేశ్వరరావు, సీపీఐ ఎంఎల్ నాయకుడు విశ్వనాథ, రజక సంఘం నాయకులు రమేష్, శ్రీనివాసులు, రమణ, వడ్డెర సంఘం, విద్యావంతుల వేదిక నాయకుడు చంద్రశేఖర్, ఏపీటీఎఫ్ నాయకుడు హరిబాబు, జనసేన నాయకుడు రామశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.