
● ‘అన్నమయ్య’కు మోక్షం ఎప్పుడో?
సాక్షి రాయచోటి: సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్నెన్నో హామీలు....అన్నింటికీ నాదే బాధ్యత అంటూ చంద్రబాబు చెప్పిన మాటలను ప్రజలు గుర్తు చేస్తున్నారు. బాబు గారూ గుర్తున్నాయా? అంటూ అడుగుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన బాబు గారి మాటలకు అర్థాలే వేరులే అన్నట్లు పరిస్థితి కనిపిస్తోంది. అధికారంలోకి వస్తే ఒకటేమిటి...అనేక రకాలుగా జిల్లాను తీర్చిదిద్దుతామని చెప్పినప్పటికీ ఇప్పటికీ అడుగులు పడలేదు. అధికార పగ్గాలు చేపట్టి ఏడాదిన్నర అవుతున్నా అభివృద్ధి జాడ కనిపించలేదు. అక్కడక్కడ రోడ్లు తప్ప జిల్లాలో అభివృద్ధి పనుల జాడ చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు పరిస్థితి కనిపిస్తోంది. రాయచోటి, మదనపల్లె, పీలేరు, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో పర్యటించిన చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదాలో అధికారంలోకి రాగానే రూపురేఖలు మారుస్తామన్న హామీల అమలులో మాత్రం చిత్తశుద్ధి కనిపించడం లేదని మేధావులు అభివర్ణివస్తున్నారు.
హార్టికల్చర్ హబ్ మాటేమిటి?
2014లో రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చేముందు...వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు జిల్లాకు అనేక హామీలు ఇచ్చారు. ప్రధానంగా రాజంపేట, రైల్వేకోడూరు ప్రాంతంలో బొప్పాయి, మామిడి, అరటి, ఇతర అనేక రకాల పండ్ల తోటలు సాగులో ఉన్న దృష్ట్యా హార్టికల్చర్ హబ్‌గా చేస్తానని ఒక్కసారి కాదు...అనేకమార్లు హామీ గుప్పించారు. కానీ నాటి నుంచి నేటివరకు కనీసం ఒక్క అడుగు కూడా ముందు పడలేదు. ఇప్పటికే ఈ ప్రాంత ఉద్యాన రైతులు గిట్టుబాటు ధరలు లేక ఇతర అనేక సమస్యలతో అవస్థలు పడుతున్నారు. అయితే బాబు ఇచ్చిన హామీ రూపు దాల్చకపోవడంతో ఇప్పటికీ అన్నదాతల కష్టం ఎవరూ తీర్చలేనిదిగా మారిపోయింది. వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలకు వచ్చిన ప్రతిసారి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు అనేకమార్లు హామీలు ఇచ్చినా ఉద్యాన హబ్ నిర్మాణం జరగలేదు.
రాయచోటిలో కనిపించని అభివృద్ధి
అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో సార్వత్రిక ఎన్నికలకు పది రోజుల ముందుగా భారీగా హాజరైన జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించిన సందర్బంలో చంద్రబాబు రాయచోటి రూపురేఖలు మారుస్తామని చెప్పినా కనీసం పెండింగ్ పనులకు మోక్షం లేదు. గత వైఎస్సార్ సీపీ హయాంలో చేపట్టిన అనేక రకాల అభివృద్ధి పనులు చివరి దశలో ఉన్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రత్యేకంగా రాయచోటికి కూటమి సర్కార్‌లో నిధుల వర్షం కురవలేదు. మధ్యతరగతి ప్రజలకు సంబంధించిన ఎంఐజీ లే అవుట్, శిల్పారామం, క్రికెట్ స్టేడియం, నగర వనం, ఇతర అనేక అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు కనిపిస్తున్నాయి.
మదనపల్లె మెడికల్ కళాశాలపై నీలి నీడలు
మదనపల్లె అభివృద్ధికి చాలా హామీలు ఉన్నా అమలు దిశగా అడుగులు పడటం లేదు. రోడ్లు మొదలుకొని మార్కెట్ల వరకు ఎన్నెన్నో మార్పులు తీసుకు వస్తామన్నా క్షేత్ర స్థాయిలో ఆవగింజంత కూడా అభివృద్ధి కనిపించడం లేదు. పైగా వైఎస్ జగన్ సర్కార్ మదనపల్లెకు మెడికల్ కళాశాల మంజూరు చేసి భవనాలు కూడా నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ ఏడాది నుంచి తరగతులు ప్రారంభించాలని ఏర్పాట్లు చేసినా అధికారంలోకి వచ్చిన తర్వాత సీట్లను కూడా కేటాయించకపోవడంతో కళాశాలపై నీలినీడలు అలుముకున్నాయి. రానున్న కాలంలో మెడికల్ కళాశాల ఉంటుందా? ఉండదా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.
బాబు ఇచ్చిన హామీల అమలుకు ఎదురుచూపులు
అన్నమయ్య ప్రాజెక్టుకు పడని అడుగులు
అధికారంలోకి వచ్చినా మదనపల్లె వైద్య కళాశాలను పట్టించుకోని వైనం
హార్టికల్చర్ హబ్ అని ఎన్నిమార్లు చెప్పినా అతీగతీ లేని స్థితి
కొత్త జిల్లాలపై స్పష్టత ఇవ్వాలంటున్న ప్రజలు
నేడు రాజంపేటకు రానున్న సీఎం చంద్రబాబు
జిల్లాలో భారీ వర్షాలతోపాటు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీటి ప్రవాహానికి పింఛాతోపాటు అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయి. అయితే అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అన్నమయ్య ప్రాజెక్టును మహోన్నత ఆశయంతో నూతన టెక్నాలజీ ద్వారా నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించి....టెండర్ల వరకు తీసుకు వచ్చినా తర్వాత అధికార పగ్గాలు చేపట్టిన కూటమి సర్కార్ టెండర్లను రద్దు చేసింది. అంతేకాకుండా మళ్లీ రీ డిజైన్ చేసి ప్రతిపాదనల దశలోనే మూలుగుతోంది. మరీ ప్రాజెక్టు ఎప్పుడు కడతారో సీఎం గారు చెప్పాలని రాజంపేట నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. అంతేకాకుండా కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి అనేక హామీలు ఇచ్చారు. వాటిని అమలు చేయలేదని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు.
వైఎస్సార్‌సీపీ సర్కార్ హయాంలో అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని ప్రకటించి అభివృద్ధి చేస్తూ వచ్చింది. అయితే ప్రస్తుతం మండలాలు, నియోజకవర్గాలతోపాటు జిల్లా కేంద్రాల మార్పు లు, చేర్పులపై ఊహాగానాలు వెలువడుతున్న తరుణంలో ప్రజల్లో రోజురోజుకు ఆందోళన రేకెత్తుతోంది. అయితే గతంలో రాజంపేటతోపాటు మదనపల్లెలను జిల్లాలుగా మారుస్తానని హామీ ఇచ్చారు. అయితే రాయచోటిని కూడా జిల్లా కేంద్రంగా కొనసాగిస్తూనే అభివృద్ధి చేస్తానని బాబు జనాల సాక్షిగా మాటిచ్చారు. ప్రస్తుతం అటు మదనపల్లె, ఇటు రాయచోటి, రాజంపేటల్లోనూ ఎక్కడికక్కడ జిల్లాల విషయంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాల విభజనపై స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఏది ఏమైనా సీఎం హోదాలో చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేస్తే ఊహాగానాలకు తెరపడుతుందని ప్రజలు భావిస్తున్నారు.

● ‘అన్నమయ్య’కు మోక్షం ఎప్పుడో?