
అన్నదమ్ములపై హత్యాయత్నం
మదనపల్లె రూరల్/ములకలచెరువు : ఆస్తి తగాదాల కారణంగా వ్యక్తిగత కక్షలతో అన్నదమ్ములపై ప్రత్యర్థులు హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శనివారం ములకలచెరువు మండలంలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు...బురకాయలకోటకు చెందిన రామచంద్ర, హరికుమార్, భారతీయుడు అన్నదమ్ములు. వీరికి కురబలకోట మండలం ముదివేడుకు చెందిన బంధువులు భాస్కర్, గంగాద్రి, భవానీప్రసాద్‌కు మధ్య భూతగాదాలు ఏర్పడ్డాయి. కోర్టులో హరికుమార్‌కు అనుకూలంగా భూమికి సంబంధించి తీర్పులు వచ్చాయి. దీంతో భూమి తమకు దక్కదని భావించిన భాస్కర్, గంగాద్రి, భవానీప్రసాద్‌లు కక్ష పెంచుకుని మరి కొందరితో కలిసి శనివారం తెల్లవారుజామున బురకాయలకోటకు వెళ్లి నిద్రిస్తున్న అన్నదమ్ములు రామచంద్ర, హరికుమార్, భారతీయుడుపై కర్రలు, ఆయుధాలతో మూకుమ్మడిగా దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితులను 108 వాహనంలో మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ములకలచెరువు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో బాధితులను సీపీఐ నాయకులు కృష్ణప్ప, మురళీ పరామర్శించారు. నిందితులపై కిడ్నాప్, హత్యాయత్నం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.