
దోస..రైతుకు గోస
ఈయన పేరు తాటిగుట్ల ధర్మారెడ్డి. వీరబల్లి మండలం, ఓదివీడు గ్రామం. పది ఎకరాల్లో దోపంట సాగు చేశాడు. ఇందుకోసం రూ. 12 లక్షలు పెట్టుబడి పెట్టాడు. తోటనిండా కాయలు కనిపించడంతో మంచి ఆదాయం వస్తుందని ఆశించాడు. వ్యాపారుల సిండికేట్ వల్ల ధరలు పలకలేదు. వారం నుంచి ధరలు అనుకూలిస్తున్నా దిగుబడుల సమయంలో పంట దెబ్బతిన్నట్టు రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీంతో దోసపంటను పొలంలోనే వదిలేశాడు.
రాయచోటి: జిల్లాలో దోససాగు చేసిన రైతు కష్టాలు, నష్టాలు అన్నీ ఇన్నీ కావు. వ్యయ ప్రయాసాలకోర్చి పండించిన పంటకు మార్కెట్‌లో నిలకడలేని ధరలు, దళారుల మోసాలు, ఊజీఈగ వైరస్ దాడులతో దోస రైతుకు పెట్టుబడులు కూడా దక్కక అప్పులపాలవుతున్నారు. జిల్లాలో దాదాపు మూడువేల హెక్టార్లకుపైగా విస్తీర్ణంలో వివిధ రకాల దోస పంటను రైతులు సాగు చేశారు. కొనేవారు లేకపోవడంతో పొలాల్లోనే పంటను వదిలేస్తున్నారు.
● దోసపంట దిగుబడి ఆశాజనకంగా ఉన్నప్పటికీ ధర పతనం కావడంతో రైతులు నష్టాల్లో కూరుకుపోయారు. ధరలు, మార్కెట్ మాయాజాలంతో ఓవైపు నష్టపోతుంటే మరోవైపు కల్తీ విత్తనాలు మరింత కుంగదీస్తున్నాయి. వారం కిందటి వరకు టన్ను రూ. 4 వేలు నుంచి రూ. 5 వేల లోపు పలికింది. ప్రస్తుతం వర్షాలు కురవడం, ఊజీ వైరస్ వ్యాప్తితో కాయలు దెబ్బతిన్నాయి. సాధారణంగా ఎకరా పొలంలో దోస సాగుచేస్తే పది నుంచి 12 టన్నులు దిగుబడి వస్తుంది. ఒక్కో ఎకరాకు లక్ష రూపాయలు వరకు పెట్టుబడి వస్తుంది. గత ఏడాది టన్ను దోస ధర రూ. 20 వేలు పలికింది. దీంతో ఎకరాకు రూ. 2 లక్షల వరకు మిగిలే అవకాశం ఉంది. ఈ క్రమంలో గత ఏడాది ధరే ఈ సారి కూడా ఉంటుందని జిల్లాలో విస్తారంగా ఢిల్లీ, బాబీ తదితర రకాల దోసను సాగు చేశారు. అయితే దిగుబడి వచ్చే సమయానికి దళారుల సిండికేట్ కారణంగా కొనుగోలు చేయడానికి వ్యాపారులు ముందుకు రాలేదు. మార్కెట్లకు తసుకెళ్లినా కొనేవారు ఉండరన్న అనుమానంతో పంటను కోయకుండానే వదిలేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా రూ. 50 కోట్లకుపైగా దోస సాగు చేసిన రైతులు నష్టపోయినట్లు హార్టికల్చర్ అధికారుల ద్వారా తెలుస్తోంది.
● దోసపంట మార్కెట్‌లో ప్రస్తుతం టన్ను రూ. 20 వేలు వరకు పలుకుతుంది. ధరలు అనుకూలిస్తున్నా తెగుళ్లు, ఊజీ ఈగల దాడులతో కాయలు పొలంలోనే కుళ్లిపోతున్నాయి. గత ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా మంచి ధర పలుకుతుందన్న ఆశతో సాగు చేస్తే నిరాశే మిగిలిందని రైతులు వాపోతున్నారు.
దిగుబడి ఉన్నప్పుడు ధరలేదు..ధర ఉన్నా దిగుబడి లేదు
ఊజీ ఈగతో పొలంలోనే కుళ్లిపోతున్న కాయలు
జిల్లాలో రూ. 50 కోట్ల నష్టం

దోస..రైతుకు గోస

దోస..రైతుకు గోస