రాయచోటి టౌన్: జిల్లా కలెక్టరేట్‌లో బార్లకు ఈనెల 30న డ్రా నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ అధికారి మధుసూదన్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 11 ఓపెన్ బార్లకు గాను మదనపల్లెలో మూడు, రాయచోటిలో రెండు, రాజంపేటలో రెండు బార్లకు కావాల్సిన దరఖాస్తులు వచ్చాయన్నారు. పీలేరులో ఒకటి ఉండగా దరఖాస్తు రాలేదు. కల్లుగీత కార్మికులకు కేటాయించిన బార్లకు కూడా దరఖాస్తు వచ్చినట్లు ఆయన తెలిపారు. వీటికి సంబంధించి ఓపెన్ లాటరీ డ్రా శనివారం ఉదయం 8 గంటలకు తీయనున్నట్లు తెలిపారు.
నియామకం
రాజంపేట: వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శిగా దండుగోపి నియమితులయ్యారు. ఈమేరకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు విడుదలయ్యాయి. దండుగోపి ఇది వరకు డీసీఎంఎస్ మాజీ చైర్మన్‌గా పనిచేశారు. తనకు పదవి రావడానికి సహకరించిన వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాఽథరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
చిన్నమండెం: వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా చిన్నమండెం మండలానికి చెందిన చుక్క అంజనప్పను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందాయి. ఎంపీ మిథున్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవనాధరెడ్డి, మండల అధ్యక్షులు గోవర్ధన్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.
‘దేశ భాషలందు తెలుగు లెస్స’
రాయచోటి జగదాంబసెంటర్: దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీ కృష్ణదేవరాయలు కీర్తించిన భాష మనదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్‌గా తెలుగుభాష కీర్తి పొందిందన్నారు. దేశంలో 22 అధికారిక గుర్తింపు కలిగిన భాషల్లో ఒకటిగా తెలుగు భాష వెలుగొందుతోందన్నారు.గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని వాడుక భాషలోకి తీసుకొచ్చిన మహనీయుడు గిడుగు రామమూర్తి అని, ఆయన జయంతి నాడు తెలుగు భాషా దినోత్సవం జరుపుకోవడం గర్వకారణమన్నారు. తెలుగుభాష అభివృద్ధికి గత జగన్ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శ్రీకాంత్‌రెడ్డి తెలుగుభాష దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
రాజంపేట: సీఎం చంద్రబాబునాయుడు రాజంపేట మండలం బోయినపల్లిలో సెప్టెంబర్ ఒకటో తేదీన పర్యటించనున్నారు.ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించారు. లబ్ధిదారులకు ఫించన్ల పంపిణీ సభలో సీఎం ప్రసంగించనున్నారు. ప్రజావేదిక,హెలిప్యాడ్ స్థలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.కార్యక్రమంలో డివిజన్ రెవెన్యూ అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.
ముగిసిన డీఎస్సీ ధ్రువపత్రాల పరిశీలన
కడప ఎడ్యుకేషన్: డీఎస్సీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన శుక్రవారం ముగిసింది. కడప బాలాజీనగర్‌లోని ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో డీఈఓ షేక్ షంషుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం రెండవ రోజు ప్రశాంతంగా ముగిసింది. ఇందులో భాగంగా స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్స్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్‌తోపాటు పలు రకాల ఉపాధ్యాయ పోస్టులకు మొదటిరోజు 712 మంది అభ్యర్థులకు గాను 609 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రెండవ రోజు మిగిలిన 103 మందితోపాటు స్టేట్, జోన్‌కు సంబంధించి 535 మంది అభ్యర్థులు వచ్చారు.