
రాయచోటిలో సెప్టెంబర్ 4న 5–కే రన్
రాయచోటి: సెప్టెంబర్ 4వ తేదీన 5కె రెడ్ రన్ మారథాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ కె లక్ష్మీ నరసయ్య పేర్కొన్నారు. శుక్రవారం యూత్ ఫెస్ట్–2025లో భాగంగా హెచ్‌ఐవీ, ఎయిడ్స్, ఎస్టీఐపై అవగాహన కోసం యువతకు మారథాన్ నిర్వహించే విషయంపై రాయచోటిలోని డీఎంహెచ్‌ఓ ఛాంబర్‌లో జిల్లా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. డీఎంహెచ్‌ఓ, అడిషనల్ డీఎంహెచ్‌ఓ రమేష్ బాబులు కార్యక్రమం నిర్వహణపై అధికారులు, సిబ్బందితో చర్చించారు. 4వ తేదీ ఉదయం 5.30 గంటలకు స్థానిక గవర్నమెంట్ డిగ్రీ కళాశాల (బాలుర) నుంచి నారాయణ రెడ్డిపల్లి వరకు 5కె రన్ ఉంటుందన్నారు.
పరుగు పోటీలలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న 17 నుంచి 25 సంవత్సరాల వయస్సు గల వారు పాల్గొనవచ్చన్నారు. పోటీలలో గెలుపొందిన పురుషులకు, మహిళలకు, ట్రాన్స్ జెండర్‌లకు వేర్వేరుగా మొదటి బహుమతిగా రూ. 10 వేలు, ద్వితీయ బహుమతిగా రూ. 7 వేలు ఇవ్వనున్నట్లు అడిషనల్ డీఎంహెచ్‌ఓ తెలిపారు. ఈ పోటీలో గెలుపొందిన వారు రాష్ట్రస్థాయి పోటీలలో కూడా పాల్గొనవచ్చన్నారు. జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) అధికారి ఎం రామ్మోహన్ రెడ్డి, గుర్రప్ప, జిల్లా క్రీడా శాఖాధికారి మస్తాన్, గౌస్ బాష, జిల్లా నెహ్రూ యువకేంద్రం మై భారత్ ప్రతినిధి వెంకటేశ్వర్లు, ఇంటర్ విద్యాశాఖ డీఐఈఓ రవి, జిల్లా రెడ్ రిబ్బన్ క్లబ్ కో–ఆర్డినేటర్ వెంకటరావు, విశ్వ ప్రసాద్, క్లస్టర్, ప్రోగ్రామ్ మేనేజర్ వి భాస్కర్, క్రీడాశాఖ కోచ్ శ్రీనివాసరాజు పాల్గొన్నారు.