నిమ్మనపల్లె : పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ, పోలీస్ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించి, అసభ్యపదజాలంతో దూషించి దాడికి యత్నించిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు శుక్రవారం ఎస్‌ఐ తిప్పేస్వామి తెలిపారు. మండలంలోని కొండయ్యగారిపల్లె పంచాయతీ వెంకోజిగారిపల్లె దాసరిపేటలో వినాయకమండపం వద్ద అసభ్య నృత్యాలను ప్రదర్శించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ఎస్‌ఐ నిర్వాహకులను గురువారం మధ్యాహ్నం స్టేషన్‌కు పిలిపించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిర్వాహకులతో పాటు స్టేషన్‌కు వచ్చిన దాసరిపేటకు చెందిన తుపాకుల రోహిత్‌కుమార్(30) పోలీసులతో వాగ్వివాదానికి దిగి దురుసుగా ప్రవర్తించి పరుషపదజాలంతో దూషించి పోలీస్‌సిబ్బందిపై దాడికి యత్నించాడు. ఈ ఘటనపై సెంట్రీ పోలీస్ కానిస్టేబుల్ హరి ఇచ్చిన ప్రత్యేక నివేదిక ఆధారంగా పోలీస్‌స్టేషన్‌లో నిందితుడిపై కేసు నమోదు చేశామన్నారు.
ఆరుగురి మృతికి కారకుడైన డ్రైవర్‌కు జైలు శిక్ష
ఓబులవారిపల్లె : జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును సిమెంట్ ట్యాంకర్ ఢీ కొనడంతో ఆరుగురు మృతికి కారణమైన డ్రైవర్ మహదేవకు నాలుగున్నర సంవత్సరాలు జైలు శిక్ష విధించినట్లు ఎస్‌ఐ పి మహేష్ ఒక ప్రకటనలో తెలిపారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన మహదేవ మద్యం సేవించి సిమెంట్ ట్యాంకర్‌ను అతివేగంగా నడిపి చిన్నఓరంపాడు సమీపంలో ఆర్టీసీ బస్సును ఢీ కొన్నాడు. ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా 29 మందికి గాయాలయ్యాయి. 56 మంది సాక్షులను విచారించి రాజంపేట మూడవ అదనపు జడ్జి ఎస్ ప్రవీణ్ కుమార్ నిందితుడికి నాలుగున్నర సంవత్సరాలు జైలుశిక్ష విధించారని తెలిపారు.
కాపాడిన 108 సిబ్బంది
ఒంటిమిట్ట : మండల కేంద్రమైన ఒంటిమిట్టలో గురువారం అర్ధరాత్రి కారు అదుపుతప్పి రామతీర్థం వద్ద చెరువుకట్టపై ప్రమాదానికి గురైంది. చైన్నె నుంచి కడపకు వెళ్తున్న కారు కట్టక్రింద ఉన్న రామతీర్థం వైపునకు దూసుకెళ్లింది. ప్రమాదం అర్ధరాత్రి జరగడంతో కారులోని ప్రయాణికులు 108 నెంబర్‌కు లైవ్ లొకేషన్ పంపించి సమస్యను తెలిపారు. దీంతో సమాచారం అందుకున్న సిబ్బంది టెక్నీషియన్ నాగబాబు, పైలెట్ విజయ్ కుమార్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని రోప్ సహాయంతో ప్రమాదానికి గురైన కారులోని ప్రయాణికులు శ్రీనివాసకుమార్, లాస్యను కాపాడారు.