
కుర్నూతల సర్పంచ్ రమణయ్యపై హత్యాయత్నానికి కుట్ర
● లక్కిరెడ్డిపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు
● రక్షణ కల్పించాలని సీఐకి వినతి
లక్కిరెడ్డిపల్లి : గాదిముతుక రమణయ్య లక్కిరెడ్డిపల్లి మండలం, కుర్నూతల గ్రామ సర్పంచ్‌గా కొనసాగుతున్నాడు. గతంలో ఈయన భార్య గాదిముతుక లక్ష్మీదేవి ఐదేళ్లు సర్పంచ్‌గా కొనసాగారు. ఈయన రెండోసారి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత నాగేశ్వర తనను హతమార్చాలని పదిహేను రోజులుగా కుట్రలు పన్నుతున్నట్లు గ్రామస్తుల ద్వారా సమాచారం అందిందని రమణయ్య లక్కిరెడ్డిపల్లి పోలీసులను ఫిర్యాదు చేశారు. నాగేశ్వర (టీడీపీ నేత) తనవద్ద పిడిబాకును పట్టుకుని గ్రామంలో కొంతమంది వ్యక్తుల దగ్గర సర్పంచ్ రమణయ్యను చంపేస్తానని అన్నట్లు స్థానికులు తెలిపారని పేర్కొన్నారు. దీంతో శుక్రవారం సాయంత్రం రమణయ్య లక్కిరెడ్డిపల్లి పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఎస్‌ఐ రవీంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఎస్‌ఐ రవీంద్రబాబు నాగేశ్వరతో పాటు మరో వ్యక్తిని పిలిపించి రెండు గంటలపాటు స్టేషన్‌లో కూర్చోపెట్టారని సర్పంచ్ తెలిపారు. వారిపై కేసు పెట్టకుండా ఇంటికి పంపించేశారని అన్నారు. తనకు, తన కుటుంబానికి నాగేశ్వర ద్వారా ప్రాణహాని ఉందని, లక్కిరెడ్డిపల్లి పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు. ఈ విషయమై లక్కిరెడ్డిపల్లి సీఐ కొండారెడ్డిని ఫోన్ ద్వారా వివరణ కోరగా సర్పంచ్ రమణయ్య ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి ఇందులో ఎవరి పాత్ర ఉన్నా ఉపేక్షించేది లేదన్నారు. నాగేశ్వరను కూడా పిలిపించి విచారణ చేపట్టామని సీఐ తెలిపారు.