
అదిగో పులి!
● నాగార్జునసాగర్– శ్రీశైలం టైగర్ కారిడార్ నుంచి మన అడవుల్లోకి పులులు
● తాజాగా చిట్వేలి అడవుల్లో కనిపించిన పెద్దపులి
సాక్షి రాయచోటి: జంతువులకే రాజుగా భావించే పెద్ద పులి కనిపించింది. చిట్వేలి పరిధిలోని అడవుల్లో దర్శనమిచ్చింది. అయితే ఇదేం కొత్తకాదు... ఉమ్మడి కడపజిల్లాలోని అటవీ ప్రాంతంలో గతంలోనూ పెద్ద పులులు కనిపించాయి. గతంలో అటవీశాఖ పులుల గణన సందర్భంగా కూడా నాలుగు పెద్ద పులులు జిల్లాలో కనిపించినట్లు లెక్క తేల్చారు. ప్రధానంగా నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ కారిడార్ ప్రాంతంలో ఉన్న పులులు నిమ్మదిగా అడువులను తిరుగుతూ ఇటువైపుకు మళ్లాయి. గతంలోనూ నంద్యాల గుండ్ల మల్లేశ్వరం అటవీ ప్రాంతం నుంచి లంకమల అభయారణ్యంలో కెమెరాలకు దొరికిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా అన్నమయ్య జిల్లా పరిధిలోని పెనుశిల అభయారణ్యంలో కనిపించడంతో మళ్లీ పెద్ద పులుల మాట హాట్ టాపిక్‌గా మారింది.
అటు నుంచి ఇటు...
నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ కారిడార్ నుంచి మహానంది, నంద్యాల ప్రాంతాల్లోని అడువులతోపాటు లంకమల, పెనుశిల, నల్లమల, శేషాచలం అడవుల్లో కలియతిరుగుతూ పెద్ద పులులు మన అడవుల్లో దర్శనమిస్తున్నాయి. అటు నుంచి ఇటు, మళ్లీ ఇటు నుంచి అటు వెళుతుండడంతో అడవుల్లో అటవీ శాఖ అమర్చిన కెమెరాల్లో అప్పుడప్పుడు దొరికిపోతున్నాయి. ఇప్పటికే వైఎస్సార్, అన్నమయ్య జిల్లా పరిధిలోని సుమారు 50–60 ఉన్నట్లు అటవీఅధికారులు అంచనా వేస్తున్నారు. అయితే పెద్ద పులులు కూడా మన అడవుల్లో కనిపిస్తుండడంతో టైగర్ కారిడార్ పరిధి విస్తరణకు కూడా గతంలో అధికారులు చర్యలు తీసుకున్నారు.
అన్నమయ్యలో 4.69 లక్షల హెక్టార్లలో అడవి
జిల్లా పరిధిలో నల్లమల, శేషాచలం, ఎర్రమల, పెనుశిల, లంకమల, పాలకొండలు ఇలా అనేక పెద్ద అడవులు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 4.69 లక్షల హెక్టార్లలో అడవి విస్తరించి ఉంది. అడవుల్లో సుమారు వెయ్యి రకాలకుపైగా వివిధ రకాల పక్షులు, జంతువులు నివసిస్తున్నాయి. ప్రధానంగా అరుదైన జంతువుగా ముద్రపడిన పంగోలిన్, హానీబర్గల్ లాంటివి కూడా ఇక్కడ కనిపించాయి. శేషాచలం అడవుల్లో ఎక్కువగా ఏనుగల గుంపులు ఉన్నాయి. నీటికోసం బయటికి వచ్చినపుడు కనిపిస్తున్నాయి. మరోవైపు చిరుతల సంచారంతోపాటు పులులు, ఇతర అనేక జంతువులకు ఆవాసంగా మన అడవులు కనిపిస్తున్నాయి.

అదిగో పులి!