
ఆరా యాప్.. అంతా డూప్..!
ఆరా యాప్ పేరు వినగానే బాధితులకు గుండె గుబేల్‌మంటోంది. తక్కువ టైమ్‌లో ఎక్కువ డబ్బులు వస్తాయంటే ఎవ్వరైనా ఆశ పడతారు. ఈ బలహీనత మోసగాళ్లకు అవకాశంగా మారుతోంది. ఆర్థిక అనిశ్చితి, ఆశ కారణంగా ఇలాంటి వాటిపై మక్కువచూపుతూ మోసపోవడం మరో కారణం.
కురబలకోట : గ్లోబల్ డిజిటల్ యాడ్స్ ఫ్లాట్‌ఫాంగా వచ్చిన ఆరా యాప్ నిర్వాహకులు కొందరికి డబ్బు ఆశ చూపి భారీ స్కాంకు పాల్పడ్డారు. స్మార్ట్ ఫోన్‌లో రోజూ వచ్చే గ్లోబల్ సినీ యాడ్స్ టాస్క్‌లు 15 సెకండ్ల చొప్పున చూస్తే డబ్బులు వస్తాయని ఎర వేశారు. ఈ వలలో చిక్కిన పలువురు మోసపోయారు. తంబళ్లపల్లె, కురబలకోట, మదనపల్లె, వాల్మీకిపురం పరిసర ప్రాంతాల బాధితుల కథనం మేరకు..ఆరా ఎర్నింగ్ యాప్ ఆరు నెలలుగా ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. మొబైల్‌లో యాప్ ద్వారా నిర్దేశిత మొత్తం డిపాజిట్ చేస్తే వారానికోసారి డబ్బు వస్తుందని పేదలకు ఆశ చూపారు. వీ వన్ కింద రూ.2వేలు, వీ టు కింద రూ.4500, వీ త్రీ కింద రూ.20 వేలు, వీ ఫోర్ కింద రూ.65 వేలు ఇలా వీ నైన్ వరకూ డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పించారు. డిపాజిట్ స్థాయిని బట్టి రోజుకు ఐదు టాస్కుల నుంచి గరిష్టంగా 200 టాస్కుల వరకు యాప్‌లో యాడ్స్ చూడాలి. ఎంత మొత్తం డిపాజిట్టు చేసినా అది ఒక నెలలో వచ్చేలా ఆశ కల్పించారు. ఒక టాస్క్ చూస్తే రోజుకు రూ.10 నుండి గరిష్టంగా రూ.790 వరకు నగదు వచ్చేలా టాస్క్‌లు రూపొందించారు. అత్యాశపరులు తక్కువ రోజుల్లో ఎక్కువ సంపాదించవచ్చన్న ఆశతో డబ్బు డిపాజిట్ చేసి టాస్క్‌లు చూడసాగారు. వీరి ఐడీ కింద మరింత మందిని జాయిన్ చేస్తే ఇంకా ఎక్కువ డబ్బు వస్తుందని ఆశ కల్పించారు. స్పిన్ గిఫ్ట్ కూడా పెట్టారు. అంతేగాక ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌పోన్లు, టూవీలర్లు, కార్లు గిఫ్ట్‌గా ఇస్తామని మరిన్ని ఆశలను రేకెత్తించారు. మొదట్లో కొన్నాళ్లు నమ్మకం కల్గించడానికి డబ్బు వారి ఖాతాలకు జమ చేశారు. దీంతో మరింత మంది ఇందులో చేరారు. చెల్లించిన మొత్తం సొమ్ము ఒక నెలలో వచ్చేస్తుండడం.. ఆతర్వాత వచ్చేదంతా ఆదాయమేననే ఆశతో పలువురు ఇందులో చేరారు. వారు ఎంచుకున్న ప్లాన్ బట్టి గురు లేదా శుక్రవారం డబ్బు బ్యాంకు ఖాతాకు చేరుతుందని నమ్మించారు. ముందు చేరిన వారికి కనక వర్షమే కురిసింది. వెనుక చేరిన వారు నష్టపోవాల్సి వచ్చింది. రెండు వారాలుగా డబ్బు విత్ డ్రా కాలేదు. పైగా యాప్ ఓపెన్ కాలేదు. ఐడీ యాక్టివ్ చేసుకోవాలని సరికొత్త నిబంధన విధించారు. అప్పటికీ ఆశ చావని వారు అదనంగా డబ్బు చెల్లించి యాక్టివేట్ చేసుకున్నారు. శుక్రవారం విత్ డ్రా చేసుకోడానికి ఐడీ ఓపెన్ చేస్తే మళ్లీ సరికొత్త నిబంధన విధించారు. శ్రీప్లీస్ కాంటాక్ట్ ది హైరింగ్ మేనేజర్ శ్రీఅని వస్తుండడంతో యూజర్లు మరింత షాక్‌కు గురై దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆరా యాప్ మోసం గ్యారంటీ అని నిర్దారణకు వచ్చారు. గతంలో కూడా దేశంలో డిల్లీ, కర్నాటక, కేరళ తదితర రాష్ట్రాల్లో ఆరా లాంటి టాస్క్ ఆధారిత ఇన్‌కమ్ స్కామ్స్‌తో బాధితులు కోట్లలో నష్టపోయిన సంఘటనలు వెలుగు చూశాయి. ఆరా యాప్ మోసంతో చేసేది లే క పోలీస్ స్టేషన్లకు బాధితులు వరుస కడుతున్నారు. నిర్వాహకులు ఎవరు..ఎక్కడుంటారన్నది తెలియని పరిస్థితి. గాలిలో దీపంలా బాధితులు పరిస్థితి మారింది. ఈ ఘరానా మోసంపై విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు.
డిజిటల్ యాడ్స్ ప్లాట్‌ఫాం అంటూ మోసం
ఈజీ మనీ పేరుతో మోసపోయిన జనం

ఆరా యాప్.. అంతా డూప్..!