
చిన్నాన్న కుటుంబంపై టీడీపీ నాయకుడి దౌర్జన్యం
మదనపల్లె రూరల్ : కౌలుకు ఇచ్చిన సొంత చిన్నాన్న భూమిని ఆక్రమించుకోవడమేగాక... ఆ భూమి తనదేనంటూ చిన్నాన్న, చెల్లెళ్లపై దౌర్జన్యం చేసిన టీడీపీ నాయకుడి ఉదంతం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రెస్‌క్లబ్‌లో బాధితులు రామసముద్రం మండల టీడీపీ నాయకులు, పుంగనూరు రూరల్ టీడీపీ పరిశీలకులు గజ్జల శీతప్ప...తమకు చేసిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. రామసముద్రం మండలం చెంబకూరు పంచాయతీ బలిజపల్లెకు చెందిన గజ్జల కృష్ణప్పకు, వేర్వేరు సర్వే నెంబర్లలో 2.5 ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. ఇతడికి భార్య నారాయణమ్మ, ముగ్గురు కుమార్తెలు మహేశ్వరి, మంజుల, సావిత్రి ఉన్నారు. పదేళ్ల క్రితం గజ్జల కృష్ణప్ప, భార్య నారాయణమ్మ స్వగ్రామం మదనపల్లె మండలం కొత్తవారిపల్లెకు ఇల్లరికం వెళ్లాడు. ఈ క్రమంలో తన పేరుమీద ఉన్న పొలాన్ని, తన అన్న గజ్జల వెంకటరమణ.. అతడి కుమారుడు, టీడీపీ నాయకుడు గజ్జల శీతప్ప కౌలుకు చేసుకోవాలని, తాను కోరినప్పుడు స్వాధీనం చేయాలని గజ్జల కృష్ణప్ప చెప్పాడు. అప్పటినుంచి పొలాన్ని గజ్జల వెంకటరమణ, శీతప్ప సాగుచేసుకుంటున్నారు. రెండేళ్ల కిందట కృష్ణప్ప గుండె జబ్బుకు లోనై అనారోగ్యం పాలవడంతో కుమార్తెలతో కలిసి స్వగ్రామానికి వెళ్లాడు. తన పొలమం ఇవ్వాలని కోరగా.. కృష్ణప్ప, అతడి కుమార్తెలను పొలంలోకి రానివ్వకుండా వెంకటరమణ, శీతప్ప అడ్డుకున్నారు. పొలం తమ ఆధీనంలో ఉందని, నీకు సంబంధం లేదని, దిక్కున్న చోటు చెప్పుకోవాలంటూ దౌర్జన్యానికి పాల్పడ్డారు. కృష్ణప్ప, ముగ్గురు కుమార్తెలు..భూరికార్డులు పట్టుకుని రెవెన్యూ అధికారులను కలిసి విన్నవించినా రాజకీయ పలుకుబడి కారణంగా తామేమీ చేయలేమని చేతులెత్తేశారు. దీంతో బాధితులు స్థానిక ఎమ్మెల్యే షాజహాన్‌బాషా, ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు, విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ కార్యాలయాల్లో తమ సమస్యపై అర్జీ అందజేశారు. అమరావతిలోని ప్రజాదర్బార్‌లో ఫిర్యాదుచేస్తే, వారు స్థానిక రెవెన్యూ అధికారులకు రెఫర్ చేశారని, వారు రికార్డులు మీపేరు మీదే ఉన్నాయి. పొలంలోకి వెళ్లండని సూచించారన్నారు. పొలంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తే శీతప్ప మరోసారి దాడి చేశాడని, స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేస్తే తామేమీ సహాయం చేయలేమని చేతులెత్తేశారన్నారు. శీతప్ప రాజకీయ పలుకుబడి, అధికారం అండను చూసి అధికారులు సైతం భయపడుతున్నారని, తమకు న్యాయం జరగకపోతే చావే శరణ్యమంటూ తండ్రీ, కుమార్తెలు కన్నీటి పర్యంతమయ్యారు. కూటమిప్రభుత్వంలో ఆడపిల్లల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని, సీఎం, డిప్యూటీ సీఎం, నారాలోకేష్‌లు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.
కౌలుకు ఇచ్చిన భూమి
తనదేనంటూ రుబాబు
లోకేష్, ఎమ్మెల్యే, ఎస్పీకి ఫిర్యాదుచేసినా ఫలితం శూన్యం