
లోకాయుక్త ఆదేశాలతో క్వారీ పరిశీలన
పెద్దతిప్పసముద్రం : గ్రానైట్ క్వారీతో తాము నష్టపోతున్నామని ఓ బాధితుడి లోకాయుక్తకు ఫిర్యాదు చేయడంతో పరిశీలలకు అధికారులు కదిలారు. బాధితుడి వివరాల మేరకు.. మండలంలోని గుడ్డంపల్లి సమీపంలోని తన పట్టా భూమిని గ్రానైట్ క్వారీ యాజమనులు ఆక్రమించడమేగాక.. ప్రభుత్వ నిభంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ పులికల్లుకు చెందిన తలారి ఉత్తన్న 2023 జూలై, 10న లోకాయుక్తకు ఫిర్యాదు చేశాడు. భూ ఆక్రమణతోపాటు సదరు క్వారీ నుంచి వచ్చే భయంకరమైన శబ్దాలతో గృహాలు, సమీపంలోని పాఠశాలలు బీటలు వారుతున్నాయని, పక్కనే ఉన్న వ్యవసాయ బోర్లు కదులుతున్నాయని, పొలాల్లో బండరాళ్లు పడుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో బాధితుడి ఆరోపణలపై సమగ్రమైన నివేదిక అందజేయాలని లోకాయుక్త కార్యాలయం నుంచి కలెక్టర్‌కు ఆదేశాలందాయి. ఆయన ఆదేశాల మేరకు మైన్స్ ఏడీ రంగకుమార్, డీఎంఅండ్‌హెచ్‌వో లక్ష్మీ నరసయ్య, డీఎల్‌టీవో డాక్టర్ రమేష్, డీఎంవో శ్రీధర్, సీఎంఓ కరుణాకర్, తహశీల్దార్ శ్రీరాములునాయక్, ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ బాలచంద్రాచారి, డాక్టర్ శంకర్, ఎస్‌ఐ హరిహర ప్రసాద్, ఏవో ప్రేమలత, మండల సర్వేయర్ శ్రీవాణి, తదితరులు స్థానిక సర్పంచ్ గిరీష్, గ్రామస్థులతో కలిసి శుక్రవారం క్వారీ వద్దకు చేరుకున్నారు. 2006 నుంచి 2026 వరకు హెక్టార్ భూమిలో క్వారీకి అనుమతులున్నట్లు అధికారులు గుర్తించారు. మైన్స్ ఏడీ మాట్లాడుతూ అధికారిక అనుమతులతో క్వారీ నడుస్తోందని, ప్రభుత్వానికి శిస్తు జమ చేయకుంటే క్వారీని నిలిపవేయగా, మళ్లీ లీజు పునరుద్ధరించుకున్నారని ఫిర్యాదుదారుడి ఎదుట వెళ్లడించారు. బాధితుడు మాట్లాడుతూ తమ భూమి ఎందుకు ఆక్రమించారని ప్రశ్నించినందుకు క్వారీ యజమాని మహిళలు అని చూడకుండా తమ కుటుంబ సభ్యులైన నలుగురిపై కోర్టులో కేసు ఎలా వేస్తారని అధికారులను ప్రశ్నించారు. కోర్టులో కేసు నడుస్తుండగా క్వారీ ఎలా నిర్వహిస్తారని బాధితుడు ప్రశ్నించారు. అధికారులు న్యాయం చేయకుంటే తాను హైకోర్టును ఆశ్రయిస్తానని ఉత్తన్న అధికారుల ఎదుట స్పష్టం చేసాడు. అనంతరం అధికారులు గనుల శాఖ నిభంధనల మేరకు పట్టా భూములు ఆక్రమణకు గురయ్యాయా? క్వారీకి ఎన్ని హెక్టార్లకు అనుమతి ఉంది? ఎన్ని హెక్టార్లలో తవ్వకాలు చేపట్టారు? క్వారీ సమీపాన ఎకరం భూమిలో ప్లాంటేషన్ ఏర్పాటు చేశారా? తదితర అంశాలపై స్కూల్ పిల్లలు, ఉపాధ్యాయులతో చర్చించారు. జాయింట్ టీంలో పాల్గొన్న అన్ని శాఖల సమగ్రమైన నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని స్పష్టం చేసారు.
నిబంధనల ఉల్లంఘనపై
విచారణకు కలెక్టర్ ఆదేశం