
పోరాటాలకు సమాయత్తం కావాలి
బద్వేలు అర్బన్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై రాబోవు రోజుల్లో లౌకిక, ప్రజాస్వామ్య పార్టీలను కూడగట్టుకుని పోరాటాలకు సమాయత్తం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పేర్కొన్నారు. సీపీఐ 25వ జిల్లా మహాసభల సందర్భంగా మంగళవారం పట్టణంలోని మార్కెట్‌యార్డు నుండి నాలుగు రోడ్ల కూడలి వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
కార్పొరేట్ కంపెనీలకు దోచి పెడుతున్న మోదీ..
కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం పేద ప్రజల, రైతుల, కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి కేవలం కార్పొరేట్ వర్గాల సేవలో పరితపిస్తోందని విమర్శించారు. అధికారంలోకి వస్తే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, నల్లధనం వెలికి తీస్తామని చెప్పిన మోదీ ఇప్పటి వరకు ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారో, ఎంత నల్లధనం వెలికి తీశారో సమాధానం చెప్పాలన్నారు. పేదలకు అనుకూలంగా ఆర్థిక విధానాలు రూపొందించాల్సింది పోయి మత విద్వేషాలు సృష్టిస్తూ పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు.
రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్న చంద్రబాబు..
గత ప్రభుత్వ హయాంలో చేస్తున్న అప్పులను ఉద్దేశించి రాష్ట్రం శ్రీలంకగా మారిపోతుందని అన్న చంద్రబాబునాయుడు నేడు అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే రూ.1.75 లక్షల కోట్లు అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్నారు. ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, అధికారంలో ఉంటే మరో మాట మాట్లాడటం చంద్రబాబు నైజమన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలోనే ట్రూఅప్ ఛార్జీల పేరుతో రాష్ట్ర ప్రజలపై రూ.15 వేల కోట్ల భారం మోపిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సైతం విద్యుత్ వినియోగదారులపై ఇంత భారం ఏ ప్రభుత్వం మోపలేదన్నారు. చంద్రబాబునాయుడు గతంలో మాదిరిగానే గాలిలో మేడలు కడుతున్నారే తప్ప రాష్ట్రాభివృద్ధిపైన ఏ మాత్రం దృష్టి సారించడం లేదని చెప్పారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఈశ్వరయ్య, జాతీయ సమితి సభ్యుడు శివారెడ్డి, జిల్లా కార్యదర్శి గాలిచంద్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్, నాగసుబ్బారెడ్డి, వెంకటసుబ్బయ్య, రామయ్య, వెంకటశివ, బాదుల్లా, భాగ్యలక్ష్మి, ఏరియా సహాయ కార్యదర్శి మస్తాన్, పట్టణ, రూరల్ కార్యదర్శులు బాబు, ఇమ్మానియేలు, ఏరియా కార్యవర్గ సభ్యులు, జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన సీపీఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
బద్వేలులో ప్రారంభమైన
సీపీఐ జిల్లా మహాసభలు