
మాదక ద్రవ్యాల నిర్మూలనలో వైద్య, విద్య శాఖల పాత్ర కీలకం
రాయచోటి : మాదక ద్రవ్యాల నిర్మూలనలో వైద్య, విద్య శాఖల పాత్ర కీలకమని జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదనరావు పేర్కొన్నారు. మంగళవారం సాయత్రం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో రాయచోటి ఏఎస్పీ వెంకటాద్రితో కలిసి రెవెన్యూ, విద్య, వైద్య, ఎకై ్సజ్ తదితర అధికారులతో జిల్లా స్థాయి నార్కోటిక్స్ కో–ఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. మాదక ద్రవ్యాలు సమాజానికి చీడపురుగు వంటివని, వీటి వాడకాన్ని సమూలంగా నివారిస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని డీఆర్‌ఓ అన్నారు. పోలీస్, రెవెన్యూ, ఎకై ్సజ్, వైద్య, విద్య తదితర శాఖల సమన్వయంతోనే మాదక ద్రవ్యాలను నిర్మూలించవచ్చన్నారు. కఠిన చర్యలు లేకుంటే దీనిని అరికట్టడం సాధ్యం కాదని ఏఎస్పీకి సూచించారు. జిల్లాలో మాదక ద్రవ్యాల నిరోధకానికి వైద్యశాఖ చేట్టిన కార్యక్రమాల మీద ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేసి చూపించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లాలో వాడుతున్న మాదక ద్రవ్యాలు ఏవి, అవి ఎక్కడ అమ్ముతున్నారో జిల్లా వ్యాప్తంగా తనిఖీ నిర్వహించి తెలుసుకోవాలని జిల్లా డ్రగ్స్ అధికారిని ఆదేశించారు. జిల్లాలో ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ తదితర కళాశాలల్లో తప్పనిసరిగా మాదక ద్రవ్యాల నిర్మూలన కమిటీలు ఏర్పాటు చేసి వాటి పనితీరును పర్యవేక్షించాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తోందని జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి అన్నారు. పాఠశాలలు, కళాశాలల చుట్టూ 100 మీటర్ల దూరం వరకు సిగరెట్లు, గంజాయి వంటి మాదక ద్రవ్యాలను అమ్మితే కఠిన చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు ఉన్నాయన్నారు. పోలీస్ శాఖ, ఈగల్ వ్యవస్థలతో సమన్వయం చేసుకొని మాదక ద్రవ్యాలు అమ్ముతున్న ప్రదేశాలలో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నామని జిల్లా ఎకై ్సజ్ అధికారి మధుసూదన్ తెలిపారు. సమావేశంలో రెవెన్యూ, పోలీస్, విద్య, వైద్య తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదనరావు