
ఆటో డ్రైవర్‌పై దాడి
మదనపల్లె రూరల్ : ఆటో డ్రైవర్‌పై దాడి చేసిన సంఘటన గురువారం మదనపల్లెలో జరిగింది. ఇందిరానగర్‌కు చెందిన ఆటో నడుపుకునే సద్దాం (35)ను అదే ప్రాంతానికి చెందిన ముక్తియార్, ఫిరోజ్, సత్తార్‌తో పాటు మరి కొందరు ఈ ప్రాంతంలో తమ అనుమతిలేనిదే ఆటో నడపరాదంటూ దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఘటనలో సద్దాం తలకు గాయంకాగా స్థానికులు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
తల్లి మందలించిందని ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : తల్లి మందలించిందని ఇంటర్ చదువుతున్న కుమారుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గురువారం మదనపల్లెలో జరిగింది. ములకలచెరువు మండలం నాయునిచెరువుకు చెందిన శ్రీనివాసులు కుమారుడు శ్రీకాంత్ (18) మదనపల్లెలోని అమ్మచెరువుమిట్టలో అమ్మమ్మ ఇంటిలో ఉంటూ స్థానికంగా ప్రైవేటు కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. కొంతకాలంగా తాను అమ్మమ్మ ఇంటివద్ద ఉండనంటూ తల్లిదండ్రులకు చెబుతున్నాడు. ఈ విషయమై గురువారం తల్లి శ్రీకాంత్‌ను మందలించడంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
పాము కాటుతో
మహిళ పరిస్థితి విషమం
నిమ్మనపల్లె : పాము కాటుతో మహిళ పరిస్థితి విషమించిన సంఘటన గురువారం నిమ్మనపల్లె మండలంలో జరిగింది. వెంగంవారిపల్లె పంచాయతీ బాలినాయునిపల్లె గొల్లపల్లికి చెందిన పాలేటి భార్య మంగమ్మ(35) గ్రామానికి సమీపంలోని ఎర్రచెరువువద్ద తమ వ్యవసాయ పొలంలో పనులు చేస్తుండగా, చెట్ల పొదల్లో ఉన్న పాము ఆకస్మాత్తుగా కాలుపై కాటు వేసింది. దీంతో మంగమ్మ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు.
లారీ కింద పడి కూలీ మృతి
మదనపల్లె రూరల్ : బతుకుదెరువు కోసం వచ్చి కూలి పనులు చేసుకుంటూ లారీ కిందపడి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కూలీ మృతి చెందిన సంఘటన గురువారం రాత్రి మదనపల్లె టమాటా మార్కెట్లో జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, కాశిగంజ్ జిల్లా, నంగులా తానాకు చెందిన మోర్ సింగ్ (48), అదే ప్రాంతానికి చెందిన మరి కొంతమందితో కలిసి ఐదేళ్ల క్రితం మదనపల్లెకు బతుకుతెరువు కోసం వచ్చాడు. నీరుగట్టువారిపల్లెలో నివాసం ఉంటూ స్థానికంగా ఉన్న టమాటా మార్కెట్ యార్డులో కూలి పనులు చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి మార్కెట్లోని ఓ మండి వద్ద లారీ టమాటా బాక్సులు నింపుకొని రివర్స్ వస్తుండగా, వెనకవైపున మోర్ సింగ్ చక్రాల కింద పడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. గమనించిన స్థానికులు టూ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలతోపాటు, మృతుడి వివరాలు తెలుసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

ఆటో డ్రైవర్‌పై దాడి

ఆటో డ్రైవర్‌పై దాడి