
సంక్షేమాన్ని విస్మరిస్తున్న కూటమి ప్రభుత్వం
రాయచోటి : కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజల సంక్షేమాన్ని విస్మరించిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. గురువారం రాయచోటిలో ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. అధికారంలోకి వచ్చి 14 నెలలు పూర్తి అవుతున్నా రాజధాని నిర్మాణంతో అద్భుతాలు జరుగుతున్నాయని భ్రమింపచేయడం, రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు వచ్చాయంటూ అసత్య ప్రచారాలను అవే వాస్తవాలుగా కొన్ని పత్రికలలో కనిపించే విధంగా చేస్తున్నారని, ఏ ఒక్క వర్గానికి, ఏ ఒక్కరికీ మేలు జరిగినట్లుగా కనిపించడం లేదన్నారు. లేనివి ఉన్నట్లుగా భ్రమింప చేసేందుకు లిక్కర్ స్కామ్ అని అక్రమ కేసులు పెడుతూ ప్రజల ఆలోచనలను దారి మళ్లించడం తప్పితే ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదన్నారు. మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోతోందన్నారు.
జగన్ పాలనలో సంక్షేమం.. అభివృద్ధి
గత జగన్ ప్రభుత్వంలో మహిళలకు చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం, కాపునేస్తం, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ అనే ప్రోత్సాహకాలు అందాయన్నారు. సమయానికి అమ్మఒడి, రైతులకు రైతు భరోసా, ఇన్‌పుట్ సబ్సిడీ, గిట్టుబాటు ధరలు, ఇన్సూరెన్సులు, ప్రభుత్వమే పంటల బీమా ప్రీమియం చెల్లించడం, ఒకే సమయంలోనే రెండు లక్షల శాశ్వత ఉద్యోగాలు, సచివాలయ వాలంటీర్ల నియామకం తదితర ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పనులు చేపట్టారన్నారు.
తల్లికి వందనం కాదు.. తల్లికి వంచన..
ప్రమాణ స్వీకారం చేసి 14 నెలలు అవుతున్నా తల్లికి వందనాన్ని ఏడాది ఎగ్గొట్టి రెండో ఏడాది ఇచ్చారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. కొంతమందికి పూర్తి మొత్తం డబ్బులు పడలేదన్నారు. తల్లికి వందనం కాదని తల్లికి వంచన అన్నారు.
వాగ్దానాలను వదిలేశారు...
ఆడబిడ్డ నిధి పథకం ద్వారా నెలకు రూ. 1500 అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలని మంత్రి మాట్లాడడం చూస్తే మహిళలను ఆదుకోవాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. బీసీలకు 50 ఏళ్లకు పెన్షన్ హామీ కానీ, అత్యంత ముఖ్యంగా రెండవ ఏడాది ఖరీఫ్ అయిపోతున్నా రైతు భరోసాపై దృష్టి పెట్టడంలేదన్నారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారన్నారు.
పదవులు సినిమా టికెట్ల అమ్మకాల కోసమా?
బాధ్యతాయుతమైన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి తన సొంత సినిమాకు ప్రభుత్వ యంత్రాంగం ద్వారా టికెట్ ధరలను నిర్దేశించుకొని సామాన్యుల నుంచి వసూలు చేసుకుంటున్నారన్నారు. అదే ఆరుగాలం శ్రమించి పంటలు పండించుకునే రైతన్న గురించి ఏమాత్రం ఆలోచన చేయడం లేదన్నారు. ప్రజా ప్రతినిధులు సినిమాలను ప్రమోషన్ చేసుకుంటూ ఊరేగింపులు చేసుకుంటూ ప్రభుత్వ అధికారులతో సినిమా టికెట్లను కూడా అమ్మించాలని చూడడం ప్రజాస్వామ్య చరిత్రలో మచ్చగా మిగిలిపోతుందన్నారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన
కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి