
విజిలెన్సు, వాణిజ్య పన్నుల శాఖ అధికారుల దాడులు
రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు పట్టణంలోని ప్రధాన రహదారిలో రాజ్ కన్వెన్షన్ పక్కన ఉన్న హర్షవర్దన్ ఆటో మొబైల్స్ దుకాణంపై విజిలెన్సు, ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. విజిలెన్సు డీఎస్పీ శివన్న, వాణిజ్య పన్నులశాఖ డీపీటీఓ గీతావాణిలు దాడులు నిర్వహించి రికార్డులను పరిశీలించారు. హర్షవర్దన్ ఆటో ట్రేడర్స్ పేరుతో దుకాణం నడుపుతున్న వ్యక్తికి 2017లోనే జీఎస్టీ రద్దు అయిందని అయినప్పటికీ పేరు మార్చి దుకాణం నడుపుతూ పన్నులు ఎగ్గొట్టినట్టు గుర్తించారు. 2022 నుంచి హర్షవర్దన్ ఆటో మొబైల్స్ వారు పాత పేరుతోనే నడుపుతూ ఇన్వాయిస్‌లు, బిల్లులు రిజిస్టర్ కాకుండా సుమారు రూ. 5 లక్షలకు పైగా జీఎస్టీని ప్రభుత్వానికి చెల్లించకుండా అక్రమ వ్యాపారం చేశారన్నారు. వీఆర్‌ఓ ఈశ్వరయ్య సమక్షంలో పంచనామా నిర్వహించి దుకాణాన్ని సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో విజిలెన్సు సీఐ నారాయణ, డీపీటీఓలు ఖాజాహుస్సేన్, బాబు మోహన్, మధుసూదన్ రెడ్డి, కవిత, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.