
రాష్ట్రంలో అరాచకపాలన రాజ్యమేలుతోంది
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి ఏకుల రాజేశ్వరిరెడ్డి
కడప కార్పొరేషన్ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచకపాలన సాగుతోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి విమర్శించారు. ఆదివారం వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడమే పరమావధిగా పెట్టుకొని ఈ ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు నమోదు చేసి జైలుకు పంపి ఆనందించడం వారికి పరిపాటిగా మారిందన్నారు. లేని మద్యం కేసును సృష్టించి, తప్పుడు విచారణలు చేస్తూ రాజంపేట పార్లమెంట్ సభ్యుడు మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఇలా విపక్ష నేతలపై కేసులు పెట్టుకుంటూ పోతే దానికి అంతే ఉండదన్నారు. రాబోవు రోజుల్లో వారు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కోక తప్పదన్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వానికి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే వారు ప్రజా సేవ చేయకుండా, సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ప్రతిపక్ష పార్టీలపై తప్పుడు కేసులతో వేధించడం అన్యాయమన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత వస్తోందన్నారు. దాన్నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వేధింపులు భరించలేక, వారు చెప్పినట్లు అక్రమాలు చేయలేక నిజాయితీ కలిగిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు స్వచ్ఛందంగా రిటైర్‌మెంట్ ప్రకటించడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. అక్రమ అరెస్ట్‌లతో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను భయపెట్టలేరన్నారు. ఈ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.