
వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : వేర్వేరు ఘటనలో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పురిటి బిడ్డ చనిపోయాడని..
పెద్దమండ్యం మండలం శివపురం గ్రామానికి చెందిన ప్రభుదేవా భార్య డి.లతమ్మ (25)కు ముగ్గురు సంతానం ఉన్నారు. అయితే ఇటీవల కాన్పులో ఆమెకు ఇద్దరు మగ పిల్లలు కవలలుగా జన్మించారు. అందులో ఒక బిడ్డ అనారోగ్యం పాలై మృతి చెందాడు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని లతమ్మ మనస్తాపం చెంది ఆదివారం ఇంటివద్ద పురుగు మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
భార్య కేసు పెట్టి పుట్టింటికి వెళ్లిపోయిందని..
భార్య తనపై కేసు పెట్టి పుట్టింటికి వెళ్లిపోవడాన్ని భరించలేక భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కురబలకోట మండలం తిట్టు పంచాయతీ లక్కినేనిపల్లెకు చెందిన అమర్నాథ్ కుమారుడు జగన్నాథ్ (35) భార్య సుజాత కుటుంబ సమస్యలతో భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త, అత్తింటి వేధింపులపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీన్ని అవమానంగా భావించిన జగన్నాథ్ ఆదివారం ఇంటి వద్ద పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు బాధితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. ఆయా ఘటనలపై సంబంధిత పోలీసులు కేసులు విచారణ చేస్తున్నారు.