
బాలిక హత్య కేసులో పోలీసుల తాత్సారం
జమ్మలమడుగు : గండికోటలో మైనర్ బాలికను హత్యచేసిన నిందితులెవరో పోలీసులకు తెలిసినా వివరాలను వెల్లడించడంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని విప్లవ రచయితల సంఘం నాయకురాలు వరలక్ష్మి ప్రశ్నించారు. శనివారం ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఆమె ఎర్రగుంట్ల మండలం హనుమనగుత్తిలో బాధితురాలి తల్లిదండ్రులతో, బాలికను బైకుపై తీసుకెళ్లిన లోకేష్ తల్లితో మాట్లాడారు. అనంతరం డీఎస్పీ వెంకటేశ్వర్లును కలసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మైనర్ బాలిక హత్య జరిగిందని తెలిసిన వెంటనే లోకేష్‌ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారన్నారు. ఐదురోజులు గడిచినా ఇంతవరకు అతన్ని కోర్టు ముందు హాజరు పరచలేదన్నారు. నిందితులను గుర్తించేందుకు విచారణ చేస్తున్నామంటూ పోలీసులు కాలయాపన చేస్తున్నారనే విషయం స్పష్టమవుతోందన్నారు. నిందితుల వివరాలు ఎందుకు దాచిపెడుతున్నారో తమకు అర్థం కావడం లేదన్నారు. సంఘటన స్థలాన్ని కూడా తాము పరిశీలించామని, ఆ ప్రాంతం పూర్తిగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయిందన్నారు. గండికోటలో టోల్‌గేట్ పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారే తప్ప ఎక్కడా సెక్యూరిటి గాని సీసీ కెమెరాలు గాని లేవన్నారు. ఈ ప్రాంతానికి విదేశీ పర్యాటకులు సైతం ఎక్కువ సంఖ్యలో వస్తుంటారని, ఇలాంటి సంఘటనలు జరిగితే విదేశాల్లో సైతం మన పరువు పోతుందన్నారు. ఈ ప్రాంతంలో సెక్యూరిటీ పెంచి, పర్యాటకులకు భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం నాయకులు, న్యాయవాదులు, మహిళా సంఘాలు, సీపీఎం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.