
వరుస ఫిర్యాదులపై జిల్లా రిజిస్ట్రార్ విచారణ
కలికిరి : కలికిరి సబ్ రిజిస్ట్రార్‌పై ఇటీవల వరుస ఫిర్యాదులు అందడంపై స్పందించిన ఉమ్మడి చిత్తూరు జిల్లా రిజిస్ట్రార్ ఏ.వి.ఆర్. మూర్తి శనివారం స్థానిక రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. సబ్ రిజిస్ట్రార్ పార్థసారధిపై కొందరు డాక్యుమెంటు రైటర్లే వరుసగా పీజీఆర్‌ఎస్, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే తనపై వచ్చిన ఆరోపణలపై ఉన్నతాధికారులకు సబ్ రిజిస్ట్రార్ వివరణ ఇచ్చుకున్నారు. మరోసారి నేరుగా జిల్టా రిజిస్ట్రార్ విచ్చేసి ఫిర్యాదుదారులను విచారించారు. అయితే ప్రజలు, రైతులు కాకుండా డాక్యుమెంటు రైటర్లే ఫిర్యాదులు చేస్తుండటంపై విస్మయం వ్యక్తం చేసిన ఆయన సబ్ రిజిస్ట్రారు సమక్షంలోనే వారిని విచారించారు. సబ్ రిజిస్ట్రార్‌పై వచ్చిన ఆరోపణలపై అక్కడికక్కడే వివరణ అడిగారు. సుమారు రెండు గంటల పాటు విచారించిన ఆయన ఫిర్యాదులో వచ్చిన ప్రతి అంశాన్ని పరిశీలించారు. సమయాభావం వల్ల మరోమారు విచారణ చేస్తామన్నారు.