
ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్ అక్రమం
రాయచోటి: రాజకీయ కుట్రలతో వైఎస్సార్‌సీపీ నేతలపై పెడుతున్న కేసులు.. ప్రజాస్వామ్య విలువలకు ముప్పు అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. శనివారం రాయచోటి పట్టణం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిపై నమోదు చేసిన అక్రమ కేసులను ఖండించారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ.. వారికి నచ్చని వారిపై పథకం ప్రకారం కేసులు పెట్టుకుంటూ వస్తున్నారన్నారు. అందులో భాగంగా రాజంపేట పార్లమెంటు సభ్యులు మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేశారని విమర్శించారు. ఎన్నికలు అయిన మరుసటిరోజు నుంచే వేటాడుతున్నట్టుగా.. రాజకీయ పరమైనటువంటి కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా పెద్దిరెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేశారని, రాజకీయంగా ఎదుర్కోలేక అధికారాన్ని అడ్డుపెట్టుకొని తప్పుడు కేసులు పెట్టారని పేర్కొన్నారు. వాటిని రుజువు చేయలేక అభాసు పాలవుతారని ఎద్దేవా చేశారు. మదనపల్లి ఆర్డీఓ ఆఫీసు అగ్ని ప్రమాదంలో పెద్దిరెడ్డి హస్తం ఉందని ఆరోపించారని, దాన్ని నిరూపణ చేయని విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.
చంద్రబాబు కేసులను విచారణ చేయించాలి
చంద్రబాబు నాయుడు ఎన్నో కేసులలో స్టేలు తెచ్చుకున్నారన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు, లిక్కర్ కేసు, 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు చేసిన అవినీతిపైన కేసులున్నాయన్నారు. చంద్రబాబు నిజంగా సచ్చిలుడి అయితే తనపై వచ్చిన కేసులపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించుకోవాలని సూచించారు. గతంలో కూడా తమ పార్టీ వారిపై తప్పుడు కేసులు పెట్టారని, ఏమీ నిరూపణ చేయలేకపోయారన్నారు. రాజంపేట నుంచి మూడుసార్లు అత్యధిక మెజార్టీతో ఎంపీగా ఎన్నికై నటువంటి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని.. ప్రజల వద్దకు వెళ్లనీయకూడదన్న ఉద్దేశంతో ఏడాది నుంచి వ్యక్తిగతంగా టార్గెట్ చేశారన్నారు.
మిథున్‌కు మద్దతుగా నిలుస్తాం
ఎంపీ మిథున్‌రెడ్డిని రాజకీయ కుంట్రలో భాగంగా లిక్కర్ కేసులో ఇరికించారన్నారు. ప్రజల్లో విలువ, ఆదరణను దెబ్బతీయాన్న ఉద్దేశంతో తప్పుడు కేసులో ఇరికించారని పేర్కొన్నారు. ఈ కుట్రలకు మిథురెడ్డి భయపడే వ్యక్తి కాదన్నారు. మిథున్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు ప్రజలు, పార్టీని నమ్ముకున్న వ్యక్తులన్నారు. వారికి తాము అన్ని రకాలుగా సంఘీభావంగా ఉంటామన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ పోలు సుబ్బారెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పల్లపు రమేష్, సర్పంచ్ దండు నాగభూషణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
గడికోట శ్రీకాంత్‌రెడ్డి