
రాజకీయ కుట్రతోనే కక్ష సాధింపు
మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు
రాయచోటి: ఎంపీ మిధున్‌రెడ్డి అక్రమ అరెస్టు ప్రజాస్వామ్యానికి చీకటి రోజని మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. ఎంపీ మిథున్‌రెడ్డి అక్రమ అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని విమర్శించారు. మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేసి ఆనంద పడుతున్నారేమో కానీ... ఇది నిలబడే కేసు కాదన్నారు. కూటమి కుట్రలో భాగంగానే మిథున్‌రెడ్డిని అరెస్టు చేశారన్నారు. నారా లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగంలో భాగంగానే వైఎస్సార్‌సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అధికారంలోకి రావడానికి కూటమి ఎన్నో తప్పుడు వాగ్దానాలు చేసిందని, ఆ వాగ్దానాలను నిలబెట్టుకోలేకపోయిందన్నారు. ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత రావడంతో తప్పుడు కేసులు పెట్టడం మొదలు పెట్టారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలలు గడుస్తున్నా.. ఇంత వరకు ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం పైన దృష్టి పెట్టకుండా ప్రతిపక్ష పార్టీ నాయకులను వేధించమే పనిగా పెట్టుకున్నారన్నారు. తప్పుడు కేసులు, అరెస్టులకు భయపడేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
లిక్కర్ కేసు.. అంకెల ఆట..
లిక్కర్ కేసులో మొదటగా రూ.50 వేల కోట్ల అవినీతి జరిగిందని పేర్కొన్నారన్నారు. తరువాత రూ.30 వేల కోట్లు, మూడోసారి రూ.18 వేల కోట్లు అవినీతి జరిగిపోయిందన్నారు. తూచ్ మరలా రూ.3 వేల కోట్లు కాదు కాదని ఇప్పుడేమా రూ.2 వేల కోట్లు అవినీతి జరిగిందంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. లిక్కర్ కేసులో ఎటువంటి సంబంధం లేని కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయరెడ్డిలను పన్నాగం ప్రకారం కేసులో ఇరికించి భయాందోళనలకు గురి చేశారన్నారు. ప్రజల్లో వైఎస్సార్‌సీపీ ఖ్యాతి దెబ్బతీసే కుట్రపూరిత వ్యవహారంలో భాగంగానే నేడు రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిపై కేసులు నమోదు చేశారన్నారు.