
వినూత్న ప్రయోగం
రాష్ట్ర కమ్యూనిటీ నాచురల్ ఫార్మింగ్(ఏపీసీఎన్‌ఎఫ్) ఆధ్వర్యంలో వాల్మీకిపురం మండలంలోని అయ్యవారిపల్లిలో డ్రై వరి సాగును ఏపీసీఎన్‌ఎఫ్ జిల్లా ప్రాజెక్టు డైరెక్టరు వెంకటమోహన్ ప్రారంభించారు. అయ్యవారిపల్లికి చెందిన ఏపీసీఎన్‌ఎఫ్ క్లస్టర్ ఇన్‌చార్జి స్వాతి పొలంలో 20 సెంట్ల విస్తీర్ణంలో డ్రైవరి, అందులోనే మిశ్రమ పంటలుగా టమాటా, మిరప, ఉల్లి, బంతిపూలు, మొక్కజొన్న, ఆముదం, ముల్లంగి, బీర, కాకర, కీర, పాలకుర, సొరకాయ, దనియాలు, మెంతులు, అలసంద వంటి 21 రకాల విత్తనాలను నాటారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ డ్రై వరి పద్ధతి ద్వారా తక్కువ నీటితో ఎక్కువ పంట దిగుబడి సాధించవచ్చన్నారు. నాలుగు అడుగులు వెడల్పుతో బెడ్‌లు, ఒక్క అడుగు వెడల్పుతో కాలువలు ఏర్పాటు చేయడంతో అంతరపంటలు సాగు చేసుకోవడానికి వీలుంటుదని తెలిపారు. డ్రైవరి సాగుతో భూమిలో తేమ నిల్వ ఉండటంతో పాటు జీవసారం పెరుగుతుందని, వ్యవసాయ ఖర్చులు తగ్గి ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు పొందవచ్చని చెప్పారు. ఐసీఆర్‌పీఎస్ ప్రతినిధులు పంటల మిశ్రమం, బయో మల్చింగ్, ప్రకృతి వ్యవసాయ సూత్రాలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్ సుబ్బరామయ్య,హెచ్‌ఎన్‌ఎఫ్ సాహితి పాల్గొన్నారు.
–కలికిరి(వాల్మీరిపురం)