మదనపల్లె సిటీ: డిగ్రీ అడ్మిషన్లపై కూటమి ప్రభుత్వం ఎటూ తేల్చనంటోంది. ఇంటర్మీడియట్ ఫలితాలొచ్చి రెండు నెలలవుతున్నా డిగ్రీ అడ్మిషన్ల నోటిఫికేషన్ ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది. భవిష్యత్తులో డిగ్రీ పట్టా అందుకోవాల్సిన విద్యార్థులు కోర్సుల్లో ప్రవేశానికి ఎదురు చూస్తు న్నారు. జులై మొదటి వారానికి డిగ్రీ ప్రవేశాలు పూర్తయి తరగతులు మొదలుకావాలి. సగం రోజు లు పూర్తికావొస్తున్నా ఎస్వీ యూనివర్సిటీ నుంచి కౌన్సెలింగ్ ప్రకటన వెలువడ లేదు. ఓ వైపు ఇంజినీరింగ్ ప్రవేశాలకు ఏర్పాట్లు జరుగుతుండగా, డిగ్రీ ప్రవేశాలపై ఇంత వరకు ఎలాంటి కదలిక లేకపోవడం గమనార్హం. ఏ కోర్సులో చేరాలి .. అందుబాటులో ఉన్న డిగ్రీ కళాశాలలో కోరుకున్న సీటు దక్కుతుందో లేదోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో తొమ్మిది ప్రభుత్వ, 30కిపైగా ప్రైవేటు డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఇందులో సుమారు 10 వేల వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. గత ఏడాది ఆన్‌లైన్ విధానంలో కౌన్సెలింగ్ నిర్వహించి డిగ్రీ ప్రవేశాలు పూర్తి చేశారు. ఈ ఏడాది ఆన్‌లైన్‌లో చేయాలా. నేరుగా చేయాలనే దానిపై కొంత కాలంగా తర్జనభర్జన పడుతున్నారు. మరో వైపు డిగ్రీలో సబ్జెక్టుకు సంబంధించి సింగిల్ మేజరా.. డబుల్ మేజరా అనే దానిపైనే చర్చ నడుస్తోంది. ఈ రెండింటిపై ఇంత వరకు ఉన్నత విద్యామండలి నుంచి స్పష్టత రాలేదు. ఈ ప్రభావం డిగ్రీ ప్రవేశాలపై కూడా ఉంది. కౌన్సెలింగ్ ప్రకటన ఎప్పుడు వస్తుందా.. అని నిరీక్షిస్తున్నారు. ఇంజినీరింగ్ వంటి కోర్సుల్లో చేరేందుకు ఆర్థిక స్థోమత లేని పేద విద్యార్థులకు డిగ్రీనే ఆధారం. ఓ వైపు కళాశాలకు వెళుతూనే సాయంత్రం సమయంలో ట్యూషన్లు వంటివి చెప్పుకుంటూ పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తూ చదివే వారు ఉన్నారు. ముఖ్యంగా అమ్మాయిలు తాము నివాసం ఉన్న ప్రాంతంలోని డిగ్రీ కాలేజీలో సీటు దక్కుతుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి వారంతా ఇంత తక్కువ సమయంలో కౌన్సెలింగ్ ప్రకటన వెలువడితే డిగ్రీలో ఏ సబ్జెక్టు ఎంపిక చేసుకోవాలి.. కళాశాల ఉండే ప్రాంతంలో వసతి సౌకర్యం ఎలా అన్న దానిపై ఆందోళన చెందుతున్నారు.
● అడ్మిషన్ల ప్రక్రియ ప్రకటనలో జరుగుతున్న జాప్యాన్ని ప్రైవేటు కాలేజీలో తమకు అనుకూలంగా మార్చుకున్నాయి. ఇంటర్ ఫలితాలు వచ్చిన వెంటనే విద్యార్థులను చేర్చుకోవడంతో పాటు మార్కుల జాబితాను,టీసీ,ఇతర సర్టిఫికెట్లను ప్రైవేటు కాలేజీలు సేకరిస్తున్నాయి. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే ఇప్పటికే చేరిన వారిని దరఖాస్తు చేయించి తమ కాలేజీలను ఆప్షన్లుగా ఎంచుకునే విధంగా ఏర్పాట్లు చేసుకున్నాయి.
సమయం లేదు మిత్రమా?
ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించినా అది నెలకుపైగా సాగుతుంది. గతంలో రెండు నెలల సమయం వరకు షెడ్యూలు ఇచ్చి విద్యార్థుఽలకు ఇబ్బందులు లేకుండా ప్రక్రియ నిర్వహించేవారు. కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు షెడ్యూలే ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది. తొలి విడతలో మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు మరో రెండు విడతలు ప్రక్రియ నిర్వహించాలి ఇదంతా జరిగి క్లాసులు ప్రారంభమయ్యే సరికి ఆగస్టు నెల వచ్చేస్తుందని విద్యార్థి సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు.
ఆఫ్‌లైన్ కోసమే ఆలస్యమా?
డిగ్రీ విద్యార్థులకు అడ్మిషన్ల ప్రక్రియను సలభతరం చేసేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2022–23లో ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా సులువుగా ఆన్‌లైన్ విధానంలో అడ్మిషన్లు పొందేవారు. కూటమి ప్రభుత్వం ఆన్‌లైన్ విధానాన్ని రద్దు చేసి తిరిగి ఆఫ్‌లైన్‌లో అడ్మిషన్లు చేపట్టేందుకు కుట్ర పన్నుతున్నట్లు తెలుస్తోంది. ఇందు కోసమే ఆడ్మిషన్లలు ప్రక్రియ ఇంకా ప్రారంభించలేదని విద్యార్థి సంఘ నాయకులు ఆరోపిస్తున్నాయి.
డిగ్రీ ప్రవేశాలకు విద్యార్థుల ఎదురు చూపులు
ఎస్వీయూ పరిధిలోప్రారంభం కాని కౌన్సెలింగ్